అమెరికా సైనికులపై ‘ఆకలి’ కుట్ర?
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:07 AM
అమెరికాలో ఆ దేశ సైనిక స్థావరాల్లో ఉన్న ఫ్రీజర్లపై సైబర్ దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సైనిక స్థావరాల్లో ఆగస్టులో
ఒకేసారి చెడిపోయిన అనేక ఫ్రీజర్లు
నిల్వ ఉంచిన ఆహారం పాడవటంతో సైనికులకు ఆహార కొరత
సైబర్ దాడి జరిగిందన్న అనుమానంతో తాజాగా పెంటగాన్ దర్యాప్తు
గత నెల మొదట్లో ఫ్రాన్స్‌లోనూ వందలాది ఫ్రీజర్లు హ్యాక్
వాషింగ్టన్, నవంబరు 2: అమెరికాలో ఆ దేశ సైనిక స్థావరాల్లో ఉన్న ఫ్రీజర్లపై సైబర్ దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆగస్టు నెలలో అరిజోనాలోని ఫోర్ట్ హాచుకాతోపాటు ఆరు సైనిక స్థావరాల్లోని వాణిజ్య ఫ్రీజర్లు ఒకేసారి చెడిపోయాయి. వాటిల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో వాటిల్లో నిల్వ ఉంచిన ఆహారపదార్థాలన్నీ పాడయ్యాయని పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక సైనిక అధికారి వెల్లడించారు. ఆహారం చెడిపోవటంతో సైనికులకు తాత్కాలికంగా ఆహార కొరత ఏర్పడింది. మొదట ఈ ఘటనను సాంకేతిక లోపంగానే పరిగణించారు. అయితే, అక్టోబరులో ఫ్రాన్స్‌లోని దాదాపు 350 సూపర్ మార్కెట్లలోని ఫ్రీజర్లను ఒకేరాత్రిలో హ్యాకర్లు తమ నియంత్రణలోకి తీసుకొని వాటిల్లో ఉష్ణోగ్రతలను భారీగా పెంచేశారు. దీంతో వాటిలో ఉన్న కోట్ల యూరోల విలువైన ఆహారపదార్థాలు పాడయ్యాయి. ఈ ఘటన తర్వాత తమ సైనిక స్థావరాల్లోని ఫ్రీజర్లపై కూడా సైబర్ దాడి జరిగి ఉంటుందన్న అనుమానంతో అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ దర్యాప్తు ప్రారంభించిందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, ఈ దర్యాప్తు గురించి అధికారులు ఏ వివరాలూ బయటకు చెప్పటం లేదు. సైనికులను ఆకలితో మాడ్చేసేందుకే ఈ కుట్ర జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి