Share News

బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి.. హెజ్‌బొల్లా సీనియర్ కమాండర్ హతం..

ABN , Publish Date - May 07 , 2026 | 12:35 PM

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. దక్షిణ లెబనాన్ ప్రాంతంలోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది.

బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి.. హెజ్‌బొల్లా సీనియర్ కమాండర్ హతం..
Israel Beirut strike

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. దక్షిణ లెబనాన్ ప్రాంతంలోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడిలో హెజ్‌బొల్లా సీనియర్ కమాండర్ మాలెక్ బల్లౌట్ హతమయ్యారు. ఈ విషయాన్ని హెజ్‌బొల్లా వర్గాలు ధ్రువీకరించినట్టు తెలుస్తోంది (Hezbollah commander killed).


లెబనాన్ దక్షిణం, తూర్పు ప్రాంతాలలో జరిగిన వైమానిక దాడులలో కనీసం 11 మంది మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హెజ్‌బొల్లాకు బాగా పట్టు ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతంలోని ఘోబేరిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయని లెబనాన్ ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కాగా, హెజ్‌బొల్లా రద్వాన్ దళాల కమాండర్‌ను తమ సైన్యం లక్ష్యంగా చేసుకుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు (Israel Beirut strike).


రద్వాన్ నాయకులు సమావేశం నిర్వహిస్తున్న అపార్ట్‌మెంట్‌పై ఈ దాడి జరిగింది (Hezbollah Radwan force). దాడి అనంతరం శిథిలాలతో నిండిన ఒక భవనాన్ని, తమ సామానులతో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్తున్న ప్రజలను చూసినట్టు అంతర్జాతీయ మీడియా విలేకరి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్.. లెబనాన్‌ దక్షిణ ప్రాంతంపై, పదేపదే బాంబు దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సైనికులపై హెజ్‌బొల్లా దాడులు చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి


పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Updated Date - May 07 , 2026 | 12:35 PM