Share News

అమెరికాలోని సియాటెల్‌ ఫుడ్ ఫెస్టివల్‌లో సామూహిక కాల్పులు

ABN , Publish Date - Jul 27 , 2026 | 11:10 AM

అమెరికాలోని ప్రసిద్ధ నగరమైన సియాటెల్‌లో మాస్ షూటింగ్ మరోసారి కలకలం రేపింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన స్పేస్ నీడిల్ సమీపంలో జరుగుతున్న ఫుడ్ ఫెస్టివల్ మీద జరిపిన కాల్పుల్లో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

అమెరికాలోని సియాటెల్‌ ఫుడ్ ఫెస్టివల్‌లో సామూహిక కాల్పులు
Mass Shooting at Seattle's Bite of Seattle Food Festival

వాషింగ్టన్, జులై 27: అమెరికాలోని ప్రసిద్ధ నగరమైన సియాటెల్‌లో తుపాకీ సంస్కృతి పడగ విప్పింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన స్పేస్ నీడిల్ (Space Needle) సమీపంలో జరుగుతున్న వార్షిక ఫుడ్ ఫెస్టివల్ దగ్గర దుండగులు మాస్ షూటింగ్‌కు పాల్పడ్డంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.


కోలాహలంగా సాగుతున్న వేడుకల్లో అకస్మాత్తుగా రక్తపాతం

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ సామూహిక కాల్పుల ఘటన జరిగింది. వందలాదిగా ఉన్న ఫుడ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌‌తో కళకళలాడుతున్న సియాటెల్‌ సెంటర్‌లో అకస్మాత్తుగా తుపాకీ మోతలు వినిపించాయి.


పత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. సభాప్రాంగణం లోపల దాదాపు 7 నుంచి 8 రౌండ్ల వరకు కాల్పుల శబ్దాలు వినిపించాయి. తుపాకుల మోత వినగానే అక్కడున్న వేలాది మంది జనాలు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి అనేకమంది కిందపడిపోయారని 25 ఏళ్ల ఎస్టాన్ వాకోనాబో అనే ప్రత్యక్షసాక్షి తెలిపారు. ఆ సమయంలో పరిస్థితి పూర్తి అల్లకల్లోలంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనా స్థలంలో పడి ఉన్న మృతదేహాల దృశ్యాలు, భయంతో జనం పరుగులు తీస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


సహాయక చర్యలు, పోలీస్ హెచ్చరికలు

ఘటన జరిగిన వెంటనే సియాటెల్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగింది. గాయపడిన బాధితులను వెంటనే సమీపంలోని హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్‌కు (Harborview Medical Centre) తరలించారు. ఈ దాడికి పాల్పడిన కొందరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సియాటెల్‌ సెంటర్ వైపు ఎవరూ రాకుండా సురక్షితంగా ఉండాలని పోలీసులు సోషల్ మీడియా వేదిక 'X' లో విజ్ఞప్తి చేశారు.


ప్రసిద్ధ 'బైట్ ఆఫ్ సియాటెల్‌' ఉత్సవం

1982లో ప్రారంభమైన ఈ 'బైట్ ఆఫ్ సియాటెల్‌' ఫెస్టివల్ నగరంలో అత్యంత ఆదరణ పొందిన ఉత్సవాల్లో ఒకటి. ప్రతి ఏటా మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాలకు దాదాపు 3,50,000 మంది ఆహార ప్రియులు, పర్యాటకులు హాజరవుతారు. అంతటి భారీ జనసమ్మర్ధం ఉన్న ప్రాంతంలో ఈ దారుణం జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.


ఇవి కూడా చదవండి:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 27 , 2026 | 12:21 PM