Share News

వచ్చే ఏడాది ‘క్వాడ్‌’ నౌకాదళ విన్యాసాలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:08 AM

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా క్వాడ్‌ కూటమి కార్యాచరణ ప్రకటించింది.

వచ్చే ఏడాది ‘క్వాడ్‌’ నౌకాదళ విన్యాసాలు
quadmeeting

  • తొలిసారిగా నాలుగు దేశాల నేవీ,గస్తీ విమానాలతో విన్యాసాలు

మనీలా, నవంబరు17: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా క్వాడ్‌ కూటమి కార్యాచరణ ప్రకటించింది. నాలుగు దేశాల ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు నిర్వహించాలని.. ఇండో-పసిఫిక్‌లో సముద్ర నిఘా వ్యవస్థ, కేబుళ్ల అనుసంధానం, ఏఐ, సైబర్‌ భద్రత రంగాల్లో కొత్త భాగస్వామ్యాలు నెలకొల్పాలని నిర్ణయించింది. అదే సమయంలో చైనాకు పరోక్ష హెచ్చరికలు చేసింది. బలప్రయోగం, బెదిరింపుల ద్వారా సహా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అస్థిరతకు దారితీసే ఏకపక్ష చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌, జపాన్‌ ప్రధాని సనే తకైచి భేటీ అయి చర్చించిన అనంతరం ‘క్వాడ్‌’ సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. ఏకపక్షంగా విధించే ఎగుమతి ఆంక్షలతో సహా ఆర్థిక ఒత్తిళ్లకు సంబంధించిన పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ఆ ప్రకటనలో నేతలు పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సముద్ర రవాణా మార్గాలు స్వేచ్ఛగా, సురక్షితంగా సాగేలా కలిసికట్టుగా కృషి చేస్తామని ప్రకటించారు. క్వాడ్‌ దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత విస్తరించేందుకు తొలిసారిగా ’క్వాడ్‌ బిజినెస్‌ లీడర్స్‌ ఫోరం’ భేటీ నిర్వహించనున్నట్టు తెలిపారు. సముద్ర నిఘా కోసం ‘ఇండో-పసిఫిక్‌ మారిటైమ్‌ సర్వైలెన్స్‌ కొలాబరేషన్‌’ పేరుతో సమన్వయం చేసుకోన్నుట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది నిర్వహించే ఉమ్మడి సైనిక విన్యాసాల్లో భాగంగా.. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లకు చెందిన పీ-8, పీ-3సీ గస్తీ విమానాలు పాల్గొంటాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Updated Date - Nov 18 , 2026 | 06:09 AM