ప్రత్యేక విమానాల్లో ఖతార్ గుర్రాల తరలింపు
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:31 AM
ఇరాన్ దాడుల నేపథ్యంలో ఓవైపు ఖతార్ నుంచి తమ మాతృభూమికి తిరిగి వెళ్లేందుకు అనేక మంది భారతీయులు ప్రతి రోజూ ఎయిర్‌లైన్స్‌లు, భారతీయ ఎంబసీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా.. మరోవైపు ప్రత్యేక విమానాల...
ఇరాన్ దాడుల నేపథ్యంలో బెల్జియంకు 147 గుర్రాలు
వాటి ఆలనాపాలనా చూసేందుకు తోడుగా వైద్యులు, ఇతర సిబ్బంది
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి
ఇరాన్ దాడుల నేపథ్యంలో ఓవైపు ఖతార్ నుంచి తమ మాతృభూమికి తిరిగి వెళ్లేందుకు అనేక మంది భారతీయులు ప్రతి రోజూ ఎయిర్‌లైన్స్‌లు, భారతీయ ఎంబసీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా.. మరోవైపు ప్రత్యేక విమానాల ద్వారా గుర్రాలను దేశం నుంచి సురక్షితంగా విదేశాలకు తరలించారు. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో తమ దేశంలోని ప్రజలపైనేకాకుండా జంతువుల పట్ల కూడా ఖతార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గల్ఫ్ దేశాలన్నీ ఒంటెలు, గుర్రాల పట్ల అమితాసక్తి ప్రదర్శిస్తాయి. ఈ ప్రాంతానికి చెందిన అరేబియా గుర్రాలు ప్రపంచ ఖ్యాతి పొందాయి. యావత్తు ప్రపంచానికి గ్యాస్ సరఫరా చేసే ఖతార్ కూడా తమ గుర్రాలకు అదే స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుంది. దాడుల నేపథ్యంలో గుర్రాలను తమ దేశం నుంచి సురక్షితంగా ఐరోపాకు రెండు ప్రత్యేక బోయింగ్ విమానాల ద్వారా తరలించి గుర్రాల పట్ల తమకున్న ఆసక్తిని ఖతార్ చాటింది. క్షిపణుల దాడుల శబ్దాలకు గుర్రాలు ఆందోళనకు గురికాకుండా ఉండేందుకుగాను వీటిని విదేశాలకు తరలించినట్లుగా భావిస్తున్నారు. దేశ గగనతలం మూసి ఉండడంతో పొరుగున 450 కిలో మీటర్ల దూరంలో ఉన్న సౌదీలోని రియాద్‌కు రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేకంగా గుర్రాలను తరలించి అక్కడి నుంచి ఖతార్ ఎయిర్‌వేస్ ప్రత్యేక విమానాల ద్వారా 147గుర్రాలను బెల్జియంకు తరలించింది. రియాద్ నుంచి 6 గంటల బెల్జియం విమాన ప్రయాణ సమయంలో గుర్రాల ఆలనాపాలనా చూసేందుకు ప్రత్యేకంగా 90మంది వైద్యులు, సిబ్బంది కూడా వెళ్లారు. విమానంలో గుర్రాలకు దాణా, తాగునీరు అందించడం, మలమూత్ర విసర్జనను శుభ్రం చేయడం వీరి పని. సాధారణంగా విమానాలు ఆకాశంలో ఎత్తుకు ఎగిరాక చలి పెరిగిపోతుంది. దీని కారణంగా గుర్రాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విమానంలో ఎయిర్ కండిషన్‌ను నిరంతరం పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. టర్కీ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న ఖతార్‌విమోచన యుద్ధంలో రాజకుటుంబ అల్ తానీకు అరేబియా జాతి గుర్రాలు కూడా తమ వంతు తోడ్పాటునందించాయి, దీనికి గుర్తుగా యుద్ధం జరిగిన ప్రదేశంలో గుర్రాల పెంపకం, రేస్ కోర్సు కేంద్రం కూడా ఉంది.
దీన్ని ఖతార్ రాజ కుటుంబం ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా అరేబియా రేసు గుర్రాలలో తనకంటూ ఒక స్థానం కోసం ఖతార్ ప్రయత్నాలు చేస్తోంది. ఒక మిలియన్ డాలర్ల బహుమానం ఇచ్చే అమీర్ ట్రోఫి గుర్రపు పందేల పోటీకి ప్రపంచవ్యాప్తంగా ఆశావహులు వస్తుంటారు. హైదరాబాద్ నుంచి 12 ఏళ్ల అయిజా మీర్ అనే బాలిక కూడా వచ్చి జూనియర్ల పోటీలో వెండి పతకాన్ని గెలుచుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News