పుతిన్ విమానం అంత ప్రత్యేకమా? ‘డూమ్స్‌డే ప్లేన్’లో ఉన్న సదుపాయాలివే!
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:07 PM
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు వచ్చారు. ఆయన ప్రయాణించిన ప్రత్యేక విమానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు ఈ విమానంలో ఏముంది? దీని ప్రత్యేకతలు ఏంటి? తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడు రోజుల భారత పర్యటనకు వచ్చారు. శుక్రవారం ఉదయం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకున్నారు. అయితే, పుతిన్ ప్రయాణించిన ప్రత్యేక విమానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తున్నారో గుర్తించడం కష్టంగా ఉండేలా ఒకే రకమైన రెండు ఇల్యూషిన్ IL-96-300PU విమానాలు ఒకేసారి ప్రయాణించాయి. వాటిలో ఒకటి పుతిన్ ప్రయాణించేందుకు కాగా.. మరొకటి ప్రత్యామ్నాయ విమానంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అత్యంత భద్రతతో..
పుతిన్ సాధారణంగా ప్రత్యేకంగా మార్పులు చేసిన IL-96-300PU విమానంలోనే ప్రయాణిస్తారు. దీనిని ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’ లేదా ‘డూమ్స్‌డే ప్లేన్’ అని పిలుస్తారు. రష్యా అధ్యక్షుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ విమానంలో అత్యాధునిక సాంకేతిక, భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఒకే రకమైన రెండు విమానాలను ఒకేసారి నడపడం రష్యాకు కొత్తేమీ కాదు. ఆయన విదేశీ పర్యటనల్లో భద్రతను మరింత పెంచేందుకు గతంలోనూ ఇదే విధానాన్ని అనుసరించారు.

పుతిన్ ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’ ప్రత్యేకతలు
పుతిన్ ఉపయోగించే విమానం రష్యాలో తయారైన ఇల్యూషిన్ IL-96-300PUకు ప్రత్యేకంగా మార్పులు చేసిన వెర్షన్. 1980లలో ఇల్యూషిన్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన ఈ విమానం.. అత్యవసర పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడికి మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేసేలా రూపొందించారు. ఇందులో PS-90A టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉన్నాయి. ఇది సుమారు 11,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో సుదూర ప్రయాణాల్లో తరచూ ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు. ఈ విమానం పొడవు 55.35 మీటర్లు కాగా.. రెక్కల వెడల్పు 60.12 మీటర్లు. రష్యా అధ్యక్షుడి ప్రయాణాల కోసం పనిచేసే స్పెషల్ ఫ్లైట్ స్క్వాడ్రన్ ఈ విమానాన్ని నడుపుతుంది.

మొబైల్ కమాండ్ సెంటర్‌గా..
అత్యవసర పరిస్థితుల్లో ఈ విమానం పూర్తిస్థాయి మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. ఇందులో అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సైనిక, నిఘా, ప్రభుత్వ విభాగాలతో సురక్షితంగా కమ్యూనికేట్ అవొచ్చు. విమానంలో రాడార్ జామింగ్ టెక్నాలజీతో పాటు అధునాతన రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నట్లు సమాచారం. శాటిలైట్ లింకులు, డేటా కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా సమాచారాన్ని నిరంతరాయంగా, సురక్షితంగా పంపించుకోవచ్చు.

విలాసవంతమైన సౌకర్యాలు కూడా..
భద్రతతో పాటు ఈ విమానంలో విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్రెసిడెన్షియల్ సూట్‌లో పడకగది, బాత్‌రూమ్, ప్రైవేట్ కిచెన్, డైనింగ్ ఏరియా ఉన్నాయని, అలాగే బోర్డురూమ్ తరహా సీటింగ్‌తో కూడిన సమావేశ గది కూడా ఉందని సమాచారం. అంతేకాకుండా, విమానంలో ఇంటీరియర్‌ను విలాసవంతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
Also Read:
బ్రిక్స్ సదస్సు.. పుతిన్, షీ జిన్‌పింగ్ బస చేసే హోటళ్లలో రోజుకు అద్దె ఎన్ని లక్షలంటే..?
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత.. ఇరు దేశాల మైత్రి బలపడనుందా.?