Share News

ఐరోపాలో మంటలు!

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:39 AM

పలు సమస్యలపై ప్రజల ఆందోళనలతో యూరప్‌ దేశాలు అట్టుడుకుతున్నాయి. పారిస్‌, టిరానా నుంచి మాడ్రిడ్‌, రోమ్‌, లిస్బాన్‌ నగరాల వరకూ అన్ని చోట్లా ఆయా దేశాల్లోని ప్రభుత్వ విధానాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఐరోపాలో మంటలు!
spain

military.jpg

  • ఆందోళనలతో అట్టుడుకుతున్న పలు దేశాలు

  • ప్రభుత్వాల విధానాలపై ప్రజల ఆగ్రహం

  • పెరిగిన జీవన వ్యయం, గృహ సంక్షోభం,

  • విద్యా రంగ తదితర సమస్యలపై నిరసనలు

  • ఫ్రాన్స్‌లో ఉద్రిక్తతలు.. వెయ్యి మంది అరెస్టు

  • ఇటలీలో పెరిగిన ధరలపై పోరుబాట

  • స్పెయిన్‌, పోర్చుగల్‌లో భారీగా పెరిగిన ఇంటి అద్దెలు, గృహ ఈఎంఐలు

పారిస్‌, అక్టోబరు 25: పలు సమస్యలపై ప్రజల ఆందోళనలతో యూరప్‌ దేశాలు అట్టుడుకుతున్నాయి. పారిస్‌, టిరానా నుంచి మాడ్రిడ్‌, రోమ్‌, లిస్బాన్‌ నగరాల వరకూ అన్ని చోట్లా ఆయా దేశాల్లోని ప్రభుత్వ విధానాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలాదిగా ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, గృహ సంక్షోభం, ప్రభుత్వ విధానాలు, విద్యా రంగ సమస్యలు, ఇతర సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. కొన్ని చోట్ల హింసాత్మకపరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు, పోలీసులకు ఘర్షణలు చెలరేగుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు, నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో పాటు వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు.


ఫ్రాన్స్‌లో వెయ్యి మంది అరెస్టు

పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా, విద్యా రంగంలో సంస్కరణలు డిమాండ్‌ చేస్తూ ఫ్రాన్స్‌లో గత కొద్ది రోజులుగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పోలీసులు దాదాపు వెయ్యి మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. శనివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో 4 లక్షల మందికి పైగా పాల్గొన్నారని, పారి్‌సలో 1.1 లక్షల మంది నిరసనలు చేపట్టారని ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అయితే దేశవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా ఆందోళనల్లో పాల్గొన్నారని సీజీటీ యూనియన్‌ పేర్కొంది. పారిస్‌తో పాటు లియాన్‌, లిల్లే, మౌంట్‌పెల్లియర్‌, నాంటెస్‌ తదితర నగరాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నల్లచొక్కాలు ధరించిన తీవ్రవాదులు హింసకు పాల్పడుతున్నారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి లారెంట్‌ నెనెజ్‌ ఆరోపించారు. చాలా వరకు ఆందోళనలు శాంతియుతంగా జరుగుతున్నప్పటికీ.. ఘర్షణలు రెచ్చగొట్టే ఉద్దేశంతో అతివాద వామపక్ష గ్రూపులు పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్నాయని, ఇతర చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. మరోవైపు నిరసనలను అణచివేసేందుకు పోలీసులు బలప్రయోగానికి పాల్పడుతున్నారని ఫ్రెంచ్‌ వామపక్ష నేత, అధ్యక్ష అభ్యర్థి జీన్‌ ల్యూక్‌ మెలన్చోన్‌ విమర్శించారు.


అల్బేనియాలో..

అల్బేనియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుటుంబానికి చెందిన అభివృద్ధి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ ఏడాది మేలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నెల మధ్య నుంచి పోలీసులు, ఆందోళనకారుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. శనివారం అల్బేనియా రాజధాని టిరానాలో వేలాది మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. నిరసనకారులు పలు ప్రభుత్వ భవనాలపై దాడులు చేశారని, డజన్ల సంఖ్యలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని, 300 మందికి పైగా నిరసనకారులు, పోలీసులకు గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. శనివారం పోలీసులు రబ్బర్‌ బులెట్లు ప్రయోగించగా, కొందరు నిరసనకారులు భద్రతా దళాలపైకి బాణసంచా విసిరారు. ట్రంప్‌ కుటుంబానికి చెందిన లగ్జరీ హోటల్‌ ప్రాజెక్టు కారణంగా ఒకప్పుడు స్వచ్ఛంగా ఉన్న అల్బేనియా తీరప్రాంతంలోని కొంత భాగం ఇప్పుడు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇటలీలో గళమెత్తిన విద్యార్థులు, రైతులు

ఇటలీలో పెరిగిన నిత్యావసరాలు, ఇంధన ధరలు, జీవన వ్యయ సమస్యలపై విద్యార్థులు, ట్రక్‌ డ్రైవర్లు, రైతులు ఆందోళన బాట పట్టారు. గత వారం పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు ఎంత అణచివేత చర్యలకు పాల్పడినప్పటికీ.. శనివారం దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు 110 మంది మైనర్లతో సహా వందలాది మందిని అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్లకు తరలించారు. నిరసన ప్రదర్శనలను కట్టడి చేసేందుకు ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం ఇటీవల పలు కఠిన చర్యలకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో పోలీసులు ర్యాలీలకు ముందుగా అనేక చోట్ల సోదాలతో పాటు ఆందోళనకారులను అరెస్టు చేశారు.


france.jpgపోర్చుగల్‌లో ఆందోళనలు

పోర్చుగల్‌లో గృహ కొనుగోలు శక్తి సంక్షోభం తీవ్రంగా ఉంది. 2017 నుంచి ఇళ్ల ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. అదే సమయంలో కొత్త లీజులకు అద్దెలు కూడా దాదాపు రెట్టింపయ్యాయి. దీని వల్ల ముఖ్యంగా యువత ప్రభావితమవుతోంది. ఈ నేపథ్యంలో విపరీతంగా పెరుగుతున్న అద్దెలు, జీవన వ్యయాల కారణంగా కుటుంబాలపై ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. పోలీసులు ఆదివారం లిస్బాన్‌లోని ఓ ఆందోళన క్యాంప్‌ను ధ్వంసం చేశారు. పలువురిని అరెస్టు చేశారు.

స్పెయిన్‌లో అద్దెలపై ఆగ్రహం

స్పెయిన్‌లో కీలక సమస్యగా మారిన గృహ సంక్షోభానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతోంది. ఉద్యమానికి మాడ్రిడ్‌లోని ఒక నిరసన శిబిరం కేంద్రంగా మారింది. ఆందోళనకారులు అక్కడే క్యాంటీన్‌, క్లినిక్‌ వంటివి ఏర్పాటు చేసుకున్నారు. ఒక 87 ఏళ్ల వృద్ధురాలు ఎంతో కాలంగా నివసిస్తున్న ఇంటి అద్దెను యాజమాని ఇటీవల ఇక్కసారిగా పెంచారు. అనంతర పరిణామాల నేపథ్యంలో ఆమెను పోలీసులు బలవంతంగా ఆ ఇంటి నుంచి ఖాళీ చేయించారు. ఈ ఘటన పెరుగుతున్న ఇంటి అద్దెల ధరలు, అద్దెకు ఉండే వారికి రక్షణ లేకుండా పోవడానికి వ్యతిరేకంగా గత నెల 26 నుంచి ఉద్యమానికి దారితీసింది. ఈ క్రమంలో అద్దెదారులను ఖాళీ చేయించడాన్ని పరిమితం చేయడం, నిరవధిక అద్దె ఒప్పందాలను అందించడం లక్ష్యంగా ప్రధాని పెడ్రో సాంచెజ్‌ ప్రభుత్వం రెండు హౌసింగ్‌ బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే పార్లమెంటరీ ఆమోదం పొందడంలో మైనారిటీ ప్రభుత్వం విఫలమైంది. దీంతో సాంచెజ్‌ నవంబరు 29న ముందస్తు సాధారణ ఎన్నికలకు పిలుపునిచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అమెరికా మళ్లీ దాడి చేసినా మా విధానాలు మారవు: ఇరాన్ విదేశాంగ మంత్రి

వసుధైక కుటుంబం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం: జైశంకర్

Updated Date - Oct 26 , 2026 | 05:42 AM