Share News

సిలికాన్‌ వ్యాలీలో కీచకులు!

ABN , Publish Date - Oct 01 , 2026 | 03:50 AM

మెరికాలోని సిలికాన్‌ వ్యాలీ.. ప్రపంచ టెక్నాలజీ, స్టార్టప్‌ సంస్థలకు కేంద్రంగా పేర్కొంటారు. ఇక్కడి టెక్‌ సంస్థల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు వైరల్‌గా మారాయి.

సిలికాన్‌ వ్యాలీలో   కీచకులు!
tech

tech2 copy.jpg

  • టెక్‌ సంస్థల్లో మహిళలపై లైంగిక వేధింపులు

  • జాబితాలో 100 మందికి పైగా ప్రముఖులు

  • ‘విస్పర్‌ నెట్‌వర్క్‌’లో గోడు వెళ్లబోసుకుంటున్న మహిళలు

  • ‘ స్ర్పెడ్‌ షీట్‌వైరల్‌ కావడంతో వెలుగులోకి..

వాషింగ్టన్‌, సెప్టెంబరు 30: అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ.. ప్రపంచ టెక్నాలజీ, స్టార్టప్‌ సంస్థలకు కేంద్రంగా పేర్కొంటారు. ఇక్కడి టెక్‌ సంస్థల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు వైరల్‌గా మారాయి. సిలికాన్‌ వ్యాలీలోని టెక్‌ దిగ్గజాలు, పెట్టుబడిదారులతో ఎదురైన చేదు అనుభవాలను పలువురు మహిళలు బయటపెడుతున్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు రూపొందించిన ఒక స్ర్పైడ్ షీట్‌’లో విస్తుగొలిపే విషయాలు ఉన్నాయి. ఆ షీట్‌ వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ జాబితాలో 100 మందికిపైగా ప్రముఖుల పేర్లు ఉన్నాయి. సిలికాన్‌ వ్యాలీలోని మహిళలు తమ రక్షణ కోసం రహస్యంగా ‘విస్పర్‌ నెట్‌వర్క్‌’ పేరిట దీన్ని నిర్వహిస్తున్నారు. స్ర్పెడ్‌ షీట్‌లో ప్రముఖ పెట్టుబడిదారులు, వెంచర్‌ క్యాపిటలిస్టులు, టెక్నాలజీ, ఏఐకి చెందిన పెద్ద కంపెనీల వ్యాపారుల పేర్లు ఉన్నట్లు ‘ద న్యూయార్క్‌ పోస్ట్‌’ కథనంలో వెల్లడించింది. జాబితాలోని వ్యక్తులపై.. బాధితులకు మత్తుమందులు ఇవ్వడం, లైంగిక దాడి, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, బహిరంగంగా మాట్లాడినా కెరీర్‌ నాశనమవుతుందనే భయంతో.. మహిళలు ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకోవడం కోసమే ఈ రహస్య నెట్‌వర్క్ ఉపయోగించుకుంటున్నారు.


లైంగిక వేధింపులు, రేప్‌ ఘటనలు ఎక్కువగా ఉద్యోగులు, స్టార్టప్‌ వ్యవస్థాపకులు కలిసి ఉండే నివాస ప్రాంగణాలు, టెక్‌ పార్టీల్లో జరుగుతున్నట్లు ఈ కథనం వెల్లడించింది. ఈ స్ర్పెడ్‌ షీట్‌ గురించి బయటకు రావడంతో తాము ఎదుర్కొన్న వేధింపులను చెప్పడానికి మరికొందరు బాధితులు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ‘‘ఈ వ్యవహారంలో టెక్‌ రంగంలోని కొందరు వ్యక్తులు దళారులుగా ఉన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. ఒకరికొకరు సాయం చేసుకుంటూ తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారు. దీన్ని ఎప్‌స్టీన్‌ తరహా నెట్‌వర్క్‌గా కూడా చూడొచ్చు. ఆ నిందితులు ధనవంతులు. శక్తిమంతమైన అలాంటి వారికి ఎదురెళ్తే ప్రమాదమే. తమ వివరాలు బయటపెట్టిన వారిని వారు ట్రాక్‌ చేస్తారు. నిఘా పెడతారు. బాధితుల కుటుంబాలను దెబ్బతీస్తారు’’ అని టెక్‌ రంగానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ఒక మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టగా.. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఆమె ఫోన్‌ను హ్యాక్‌ చేసి, రహస్య సమాచారాన్ని సేకరించి, ఇబ్బంది పెట్టాడని ఆ కథనం పేర్కొంది. మరో బాధితురాలు తనపై జరిగిన లైంగిక దాడి గురించి ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుంచి తీసేశారు. తర్వాత తనకు ఎక్కడా ఉద్యోగం దొరక్కుండా చేశారని ఆమె వాపోయింది.

ఈ వార్తలు కూడా చదవండి

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

విమానాన్ని కూల్చేందుకు పైలట్ ప్రయత్నించాడా..

Updated Date - Oct 01 , 2026 | 04:04 AM