రూ. 2 లక్షల 11 వేల కోట్ల మేర ఎఫెక్ట్.. చైనాకు ఝలక్.. ట్రంప్ హ్యాపీస్.!
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:29 PM
పనామా దేశపు సుప్రీం కోర్టు నిన్న రాత్రి ఒక సంచలన తీర్పిచ్చింది. ఈ జడ్జిమెంట్ ఏకంగా భారత రూపాయల్లో రెండు లక్షల 11 వేల కోట్ల మేర ప్రభావితమయ్యే తీర్పుగా చెబుతున్నారు. అంతర్జాతీయ షిప్పింగ్ వాణిజ్య రంగంలో ఇది పెద్ద చర్చకు దారి తీస్తోంది.
ఆంధ్రజ్యోతి, జనవరి 30: అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన పనామా కాలువ (Panama Canal) సమీపంలోని రెండు ప్రధాన ఓడరేవుల నిర్వహణ ఒప్పందాలను పనామా దేశపు సుప్రీంకోర్టు రద్దు చేసింది. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ 'సీకే హచిసన్' (CK Hutchison) గ్రూప్‌నకు చెందిన(సబ్సిడియరీ) 'పనామా పోర్ట్స్ కంపెనీ' (PPC) తో కుదుర్చుకున్న ఈ కీలక కాంట్రాక్టులు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన కనిపిస్తోందని, ప్రభుత్వ ఆస్తులను లీజుకు ఇచ్చేటప్పుడు పాటించాల్సిన విధివిధానాలను విస్మరించారని కోర్టు పేర్కొంది.
ఏం జరిగింది?
పనామా కాలువకు రెండు వైపులా ఉన్న బాల్బోవా (Balboa) ఇంకా క్రిస్టోబల్ (Cristobal) ఓడరేవులను నిర్వహించేందుకు 2021లో అప్పటి ప్రభుత్వం పనామా పోర్ట్స్ కంపెనీ ఒప్పందాన్ని మరో 25 ఏళ్ల పాటు పొడిగించింది. అయితే, ఈ ప్రక్రియలో పారదర్శకత లేదని, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్లను విచారించిన పనామా సుప్రీం కోర్టు, ఆ ఒప్పందాలు చెల్లవని తీర్పునిచ్చింది. కాగా, సీకే హచిసన్ ప్రపంచంలోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటి. తాజాగా పనామా కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఆ కంపెనీకి పనామాలో ఉన్న పట్టు సడలే అవకాశం ఉంది. అయితే, వీటి నిర్వహణ ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలుస్తుందా? అనే అంశాలపై సందిగ్ధత నెలకొంది.

ఎందుకు ఇది ముఖ్యమైన తీర్పు?
పనామా కాలువ ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటిది. ఇక్కడ ఓడరేవుల నియంత్రణ ఎవరి దగ్గర ఉంటే, వారికి గ్లోబల్ సప్లై చైన్ (Supply Chain) మీద కొంత మేర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. చైనాకు చెందిన కంపెనీగా ముద్ర ఉన్న హచిసన్ గ్రూప్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పు, భౌగోళిక రాజకీయంగా (Geopolitical) కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
చైనాకు ఝలక్.. ట్రంప్ హ్యాపీస్.!
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తే... ఇది 'చైనాకు ఝలక్.. ట్రంప్ హ్యాపీస్' అన్నట్టుగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణాలు చూస్తే.. పనామా అధికారిక నామం 'రిపబ్లిక్ ఆఫ్ పనామా' (Republic of Panama). ఇది ఉత్తర, ఇంకా దక్షిణ అమెరికా ఖండాలను కలిపే మధ్య అమెరికా (Central America) లో ఉన్న ఒక సార్వభౌమ దేశం.
ఒకప్పుడు పనామా కాలువ ఉన్న ప్రాంతం (Panama Canal Zone) అమెరికా నియంత్రణలో ఉండేది. అయితే 1999 డిసెంబర్ 31న అమెరికా ఆ నియంత్రణను పూర్తిగా పనామా దేశానికే అప్పగించింది. అప్పటి నుండి ఆ కాలువ.. దాని పరిసర ప్రాంతాలన్నీ పనామా దేశపు పూర్తి సార్వభౌమత్వంలోనే ఉన్నాయి.

ఇది చైనాకు ఎందుకు 'ఝలక్'?
పనామా కాలువకు రెండు వైపులా ఉన్న ఓడరేవులను (Balboa, Cristobal) హాంకాంగ్‌కు చెందిన సీకే హచిసన్ కంపెనీ 1997 నుండి నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ద్వారా చైనాకు పనామా కాలువపై పరోక్ష నియంత్రణ ఉందని అమెరికా భావిస్తోంది. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆ ఒప్పందాలు రద్దు కావడం చైనా ప్రభావానికి పెద్ద దెబ్బ. ఈ కాంట్రాక్టులు 2047 వరకు ఉండేవి. కానీ కోర్టు తాజా తీర్పుతో కొన్ని బిలియన్ డాలర్ల వ్యాపారం, వ్యూహాత్మక పట్టును చైనా కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ట్రంప్ ఎందుకు 'హ్యాపీ'?
ఈ తీర్పుతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పంతం చాలా వరకూ నెగ్గినట్లైంది. 2025లో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, ట్రంప్ పనామా కాలువపై చైనా ప్రభావాన్ని తగ్గించాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. 'మనం కట్టిన కాలువను చైనా వాడుకోవడం ఏంటి?' అని ట్రంప్ బహిరంగంగానే ప్రశ్నించారు. అంతేకాదు, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పనామా పర్యటనకు వెళ్ళి, 'చైనా ప్రభావాన్ని తగ్గించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి' అని హెచ్చరించారు. ఈ హెచ్చరికల తర్వాత పనామా ప్రభుత్వం, కోర్టు నుండి ఇలాంటి నిర్ణయాలు రావడం ట్రంప్ దౌత్యానికి దక్కిన విజయంగా ఆయన భావిస్తున్నారు.
స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు.!
అంతేకాదు, పనామా కాలువను తిరిగి అమెరికా నియంత్రణలోకి తీసుకోవాలనేది అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన. ఈ తీర్పు ఆ మార్గాన్ని సుగమం చేసినట్లేనన్నది కొందరి వాదన. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ (BRI) ప్రాజెక్టు నుండి కూడా పనామా వైదొలగడం, ఇప్పుడు పోర్ట్ కాంట్రాక్టులు రద్దు కావడం అన్నీ కలిపి చైనాను ఆ ప్రాంతంలో ఏకాకిని చేశాయని చెప్పుకొస్తున్నారు. మరోవైపు, ఈ వార్తతో హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో సీకే హచిసన్ షేర్ల విలువ భారీగా పతనమైంది. సుమారు 5.5 శాతం పడిపోయాయి. ఇది 9 నెలల్లో అతిపెద్ద ఒక్క రోజు డ్రాప్. దీనిపై CK Hutchison, BlackRock, MSCలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ తీర్పు గ్లోబల్ ట్రేడ్ రూట్స్, పనామా కెనాల్ (ప్రపంచ మెరిటైమ్ ట్రేడ్‌లో 5 శాతం)పై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి..
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కాక్ పిట్‌లో చివరి మాటలివే..
భారీ నష్టాల నుంచి లాభాల వైపు.. చివర్లో కోలుకున్న దేశీయ సూచీలు