ఒకరిపై దాడి చేస్తే.. అందరిపై చేసినట్లే.. పాక్, సౌదీ, టర్కీ రక్షణ ఒప్పందం
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:43 PM
పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు 'మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్'పేరుతో ఒక కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడులు జరిగినా, అది మిగిలిన రెండింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు.
ఆంధ్రజ్యోతి, ఆగస్టు 7: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల వేళ అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు 'మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్' (Mecca Joint Defence Agreement) పేరుతో ఒక కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడులు జరిగినా, అది మిగిలిన రెండింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు.
సౌదీ అరేబియాలో జరిగిన సమావేశంలో క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భేటీలో పాక్ ఆర్మీ చీఫ్ కూడా పాల్గొన్నారు. ఏదేని విదేశీ సైనిక దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు, పరస్పరం రక్షణ కల్పించుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ తెలిపింది.
మూడు దేశాల వ్యూహాత్మక కలయిక
చమురు సంపద కలిగిన సౌదీ అరేబియా, అణు సామర్థ్యం ఉన్న పాకిస్థాన్, NATO కూటమిలో రెండో అతిపెద్ద సైనిక బలం కలిగిన టర్కీలు ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మూడు దేశాల మధ్య సైనిక విన్యాసాలు, టెక్నాలజీ బదిలీ, నిఘా సమాచారాన్ని (Intelligence) పరస్పరం పంచుకోనున్నారు.
ఇరాన్ అలాగే ప్రాంతీయ తిరుగుబాటు దారుల నుంచిఎదురవుతున్న డ్రోన్, మిస్సైల్ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రాధాన్యతలు మారుతుండటం, ఇజ్రాయెల్-గాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మారుతున్న ప్రాంతీయ సమీకరణాలకు ఈ ఒప్పందం స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:
ముంబై లోకల్ ట్రైన్‌లో అమానుషం.. మహిళపై వ్యక్తి దాడి..
గుజరాత్‌లో ప్రజలను భయపెడుతున్న బావి రహస్యం..