ట్రంప్ ‘ఇజ్రాయెల్’ షరతుకు పాకిస్తాన్ నో! అబ్రహం అకార్డ్స్‌పై వెనక్కి తగ్గేదే లేదన్న ఇస్లామాబాద్
ABN , Publish Date - May 26 , 2026 | 02:12 PM
ఇరాన్- అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ఏదో ఒక రకమైన లబ్ది పొందాలని భావించిన పాక్.. ఇప్పుడు అడ్డకత్తెరలోపడింది. ట్రంప్ పెట్టిన కొత్త మెలికతో ఏం చేయాలో పాలుపోక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాల్సిన పరిస్థితి పాకిస్తాన్‌కు దాపురించింది..
ఇస్లామాబాద్/వాషింగ్టన్, మే 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన సరికొత్త దౌత్యపరమైన ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని పాకిస్తాన్ తెగేసి చెప్పింది. ఇరాన్ దౌత్యపరమైన శాంతి ఒప్పందంలో (Iran Peace Deal) భాగంగా.. పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్‌తో అధికారికంగా సంబంధాలను పునరుద్ధరించే ‘అబ్రహం అకార్డ్స్’ (Abraham Accords)పై సంతకం చేయాలంటూ ట్రంప్ విధించిన షరతును పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పూర్తిగా తోసిపుచ్చారు. తమ దేశ మౌలిక సిద్ధాంతాలు, విదేశాంగ విధానంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగింది? (ట్రంప్ కొత్త షరతు):
ఇరాన్ వివాదానికి ముగింపు పలికేందుకు దౌత్యపరమైన చర్చలు తుది దశకు చేరుకున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా (Truth Social) వేదికగా ఒక అనూహ్యమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ చర్చల్లో భాగస్వామ్య దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా, ఖతార్, టర్కీలతో పాటు పాకిస్తాన్ కూడా ‘అబ్రహం అకార్డ్స్’ లో చేరడం తప్పనిసరి (Mandatory) అని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ను గుర్తించి, ఆ దేశంతో దౌత్య సంబంధాలు పెట్టుకోవాలనేది ఈ ఒప్పంద ముఖ్య ఉద్దేశం.
పాకిస్తాన్ ఎందుకు తిరస్కరించింది?
ట్రంప్ ప్రతిపాదనపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ.. 'మా ప్రాథమిక సిద్ధాంతాలతో విభేదించే ఎలాంటి ఒప్పందంలోనూ పాకిస్తాన్ చేరదు. రోజుకో మాట మార్చే (ఇజ్రాయెల్) వాళ్లతో కలిసి కూర్చోవడం మాకు సాధ్యం కాదు' అని వ్యాఖ్యానించారు. కాగా, పాస్‌పోర్ట్ పాలసీ మేరకు పాకిస్తాన్ తన 78 ఏళ్ల చరిత్రలో ఇజ్రాయెల్‌ను ఎప్పుడూ గుర్తించలేదు. పాక్ పౌరులు ఇజ్రాయెల్ వెళ్లకుండా పాస్‌పోర్ట్‌పై ప్రత్యేకంగా నిబంధన కూడా ఉంది. ఈ నేపథ్యంలో 1967 పూర్వపు సరిహద్దుల ప్రకారం స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడేంతవరకూ ఇజ్రాయెల్‌ను గుర్తించే ప్రసక్తే లేదని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
పాకిస్తాన్‌కు సరికొత్త తలనొప్పి
ఈ వివాదం ఇప్పుడు పాకిస్తాన్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను ట్రంప్ స్వయంగా పాకిస్తాన్‌కు అప్పగించారు. ఇప్పుడు ట్రంప్ మాటను కాదంటే ఆయన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. మరోవైపు, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు నిధులు ఇచ్చే సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు కూడా అమెరికా ఒత్తిడితో ఇజ్రాయెల్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి స్థితిలో ఇటు అమెరికాను తట్టుకుంటూ, అటు దేశీయంగా ఉన్న మతపరమైన సంస్థల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవడం పాకిస్తాన్‌కు కత్తిమీద సాములా మారింది.
అబ్రహం అకార్డ్స్ (Abraham Accords) అంటే ఏంటి?
డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో (2020లో) ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలను నెలకొల్పేందుకు కుదిర్చిన చారిత్రాత్మక ఒప్పందాలే ఈ 'అబ్రహం అకార్డ్స్'. ఇందులో ఇప్పటికే యూఏఈ (UAE), బహ్రెయిన్, మొరాకో, సూడాన్, కజకిస్తాన్ వంటి దేశాలు చేరాయి.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ 2026: ఆర్సీబీ ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ పాటీదార్ ఏమన్నాడంటే?
శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం