భారతీయులు, అమెరికన్లకే హోటల్ గదులా.. పాకిస్థాన్ ఎంపీ ఆరోపణలు..
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:50 PM
ఇటీవల యూఏఈలో పాకిస్థాన్ ప్రయాణికులను అవమానించారని, వారికి హోటల్ వసతి కల్పించలేదని ఆ దేశ మాజీ జాతీయ అసెంబ్లీ స్పీకర్, ఎంపీ అసద్ ఖైసర్ ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల యూఏఈలో పాకిస్థాన్ ప్రయాణికులను అవమానించారని, వారికి హోటల్ వసతి కల్పించలేదని ఆ దేశ మాజీ జాతీయ అసెంబ్లీ స్పీకర్, ఎంపీ అసద్ ఖైసర్ ఆరోపించారు. విమానం రద్దయిన తర్వాత భారత, అమెరికా పాస్‌పోర్టులు కలిగిన ప్రయాణికులకు మాత్రం హోటల్ వసతి కల్పిస్తామని ప్రకటించారని అసద్ పాకిస్థాన్ పార్లమెంట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై యూఏఈ అధికారులతో దౌత్య మార్గాల్లో మాట్లాడాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు (Asad Qaiser UAE).
యూఏఈలో తాను ప్రయాణిస్తున్న విమానం రద్దయిందని, దీంతో తనతో పాటు ప్రయాణిస్తున్న ఇతర పాక్ ప్రయాణికులు హోటల్‌లో బస చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయితే అక్కడ పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌దారుల పట్ల సరైన విధంగా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. హోటల్‌లో భారత, అమెరికా పాస్‌పోర్ట్‌లు ఉన్న ప్రయాణికులకు మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటన చేసినట్లు ఖైసర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తాను నిరసన వ్యక్తం చేసినట్లు చెప్పారు (Pakistan MP UAE hotel row).
యూఏఈలో పాకిస్థాన్‌కు చెందిన ప్రవాసులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారని ఖైసర్ గుర్తుచేశారు (Pakistani travellers UAE). ఆ దేశ అభివృద్ధిలో పాకిస్థానీల పాత్ర ఉందని పేర్కొన్నారు. తమతో యూఏఈ వారి తీరు చాలా అనుచితంగా ఉందని, అయితే ఇలాంటి ఘటనలు రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేయకూడదని ఆయన అన్నారు. ఇదే తరహాలో మరికొందరు పాకిస్థానీ ప్రయాణికులు కూడా తనను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు ఖైసర్ తెలిపారు. ఈ ఘటనను పాకిస్థాన్ విదేశాంగ శాఖ యూఏఈ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..