ఇజ్రాయెల్ నగరంపై ఇరాన్ క్షిపణి దాడి.. 9 మంది మృతి, 28 మందికి గాయాలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 09:40 PM
ఇరాన్ క్షిపణి ఇజ్రాయెల్ నగరమైన బీట్ షెమేష్‌ను తాకడంతో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 28 మంది వరకూ గాయపడినట్టు ఎమర్జెనీ సర్వీస్ వర్గాలు తెలిపాయి.
జెరూసలేం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రెండోరోజైన ఆదివారంనాడు కూడా దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేని మృతి చెందడంతో ఇరాన్ ప్రతీకారదాడులు కొనసాగిస్తోంది. ఆదివారంనాడు ఇరాన్ క్షిపణి ఒకటి ఇజ్రాయెల్ నగరమైన బీట్ షెమేష్‌ను తాకడంతో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 28 మంది వరకూ గాయపడినట్టు ఎమర్జెనీ సర్వీస్ వర్గాలు తెలిపాయి.
ఇరాన్ క్షిపణి నేరుగా ఒక భవంతిని ఢీకొట్టడంతో పెద్దఎత్తున ఇజ్రాయెల్ రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షిపణి దాడికి భవంతి కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎక్కవమందే ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు.
మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయెల్
కాగా, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి ఆదివారంనాడు విరుచుకుపడింది. భారీ పేలుళ్లతో పెద్దఎత్తున పొగలతో భీతావహ పరిస్థితులు కనిపించాయి. సెంట్రల్ టెహ్రాన్ లక్ష్యంగా తాము దాడులు జరుపుతున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్, అధికారిక టెలివిజన్ కార్యాలయం ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఖమేనీ మరణాంతరం మసీదుపై ఎర్రజెండా.. ఇది దేనికి సంకేతం
ఇక ఆపండి.. ఖమేనీ మృతిపై చైనా, నార్త్ కొరియా తొలి రియాక్షన్