Share News

కుప్పకూలిన భవనం.. సీసీటీవీలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు!

ABN , Publish Date - Nov 13 , 2026 | 09:39 PM

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బ్రూక్లిన్‌లోని ఫ్లాట్‌బుష్ అవెన్యూలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కుప్పకూలిన భవనం.. సీసీటీవీలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు!
New York Building Collapse

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బ్రూక్లిన్‌లోని ఫ్లాట్‌బుష్ అవెన్యూలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. అదే భవనంలోని ఓ ఇంటి యజమాని కుటుంబం తృటిలో ప్రాణాలతో బయటపడిన దృశ్యాలు ఆ వీడియోలు కనిపిస్తోంది.


ప్రమాదం జరిగిన సమయంలో ఆ భవనంలోని మూడో అంతస్తులో ఆండర్సన్ వెలజ్ అనే వ్యక్తి కుటుంబం ఉంది. ఆ సమయంలో వెలజ్ పని నిమిత్తం బయట ఉండగా, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఇంట్లోనే ఉన్నారు. అతడి తొమ్మిదేళ్ల పెద్ద కొడుకు రిఫ్రిజిరేటర్ తెరిచి పాలు పోసుకుంటుండగా, రెండేళ్ల చిన్నారి కింద ఆడుకుంటున్నాడు. అంతలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో వెలజ్ భార్య భయంతో కేకలు వేసింది. అప్రమత్తమైన పెద్ద కుమారుడు పరుగెత్తుకుంటూ తల్లి వైపు వెళ్లాడు. కానీ, క్షణాల వ్యవధిలోనే ఇంటి గోడలు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మరో బాలుడు శిథిలాల కింద చిక్కుకుపోయాడు. ఆ సమయంలో ఆఫీసులో ఉన్న వెలజ్‌కు ఆయన భార్య ఫోన్ చేసి పిల్లలను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. ఆ తర్వాత ఫోన్ కట్ అయిపోవడంతో వెలజ్ ఆందోళనకు గురయ్యాడు.


అదృష్టవశాత్తు సహాయక సిబ్బంది జరిపిన రెస్క్యూ ఆపరేషన్‌లో వెలజ్ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. చిన్నారి ఒంటి నిండా దుమ్ము, ధూళి నిండిపోగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద కుమారుడికి సర్జరీ జరిగి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పక్కనే జరుగుతున్న నిర్మాణ పనుల లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తుండగా, అధికారులు దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. భవనం కూలిన ఘటనకు సంబంధించి 6 సెకన్ల వీడియో వెలజ్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది.


ఈ వార్తలూ చదవండి

నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్‌-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..

Updated Date - Nov 13 , 2026 | 09:48 PM