Share News

24 మంది మృతికి కారణమైన యాక్సిడెంట్.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 13 , 2026 | 09:22 PM

అస్సాంలోని కాజీరంగ జాతీయ పార్కు సమీపంలో ప్యాసింజర్ ట్రావెలర్ బస్సు.. కంటైనర్‌ ట్రక్కును ఢీ కొట్టన ప్రమాదానికి సంబంధించిన డాష్‌క్యామ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.

24 మంది మృతికి కారణమైన యాక్సిడెంట్.. వీడియో వైరల్

గౌహతి, నవంబర్13: అస్సాంలోని కాజీరంగ జాతీయ పార్కు సమీపంలో ప్యాసింజర్ ట్రావెలర్ బస్సు.. కంటైనర్‌ ట్రక్కును ఢీ కొట్టన ప్రమాదానికి సంబంధించిన డాష్‌క్యామ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వాహనం అదుపుతప్పి లేన్ నుంచి పక్కకు వెళ్లి.. ట్రక్కును ఢీకొట్టిన దృశ్యాలు ఈ వీడియోలో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జోర్హాట్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం గోలాఘాట్ జిల్లాలోని రంగజన్ వద్ద విద్యార్థులు, ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెలర్ వాహనం.. కంటైనర్ ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.


ప్రమాదంపై స్పందించిన సీఎం..

ఈ ప్రమాదంపై అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ స్పందించారు. ఈ ఘటన స్థలాన్ని శనివారం సందర్శిస్తానని ప్రకటించారు. ఈ ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శిస్తానని తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమీక్షిస్తానని చెప్పారు.


మూల్యం చెల్లించుకుంటున్న సామాన్యులు..

మరో వైపు ఈ ప్రమాదంపై అస్సాంలోని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ స్పందించారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, వాటి నిర్వహణలో అవినీతి దాగి ఉందని మండిపడ్డారు. రహదారుల నిర్మాణంలోని లోపాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులు సరిగ్గా లేకున్నా.. టోల్ రుసుం వసూలు చేస్తున్నారంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు కుమ్మక్కు కావడం వల్లే.. సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ ఆరోపించారు.

Updated Date - Nov 13 , 2026 | 09:50 PM