Share News

న్యూజెర్సీ అంతా ‘దీపావళి’ చెత్త!

ABN , Publish Date - Nov 11 , 2026 | 02:57 AM

దీపావళి పండుగకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.. పోటాపోటీగా బాణసంచా కాల్చడమూ సాధారణమే. కానీ అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయులు జరుపుకొన్న దీపావళి మాత్రం తీవ్ర విమర్శలు దారితీసింది

న్యూజెర్సీ అంతా ‘దీపావళి’ చెత్త!
dust cleaning

  • భారతీయులు భారీగా బాణసంచాకాల్చడంతో చెత్తమయమైన రోడ్లు, వీధులు

  • వాయు, ధ్వని కాలుష్యంతో ఇబ్బందులు

  • అగ్నిమాపక శకటాలు, నీటి క్యానన్లతో

  • చెత్త తొలగింపు.. వీడియోలు వైరల్‌

  • పౌర స్పృహపై సామాజిక మాధ్యమాల్లో చర్చ

వాషింగ్టన్‌, నవంబరు 10: దీపావళి పండుగకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.. పోటాపోటీగా బాణసంచా కాల్చడమూ సాధారణమే. కానీ అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయులు జరుపుకొన్న దీపావళి మాత్రం తీవ్ర విమర్శలు దారితీసింది. న్యూజెర్సీ సిటీ, ఇండియా స్ట్రీట్‌ తదితర ప్రాంతాల్లో భారతీయులు రోడ్లు, వీధుల్లో భారీగా బాణసంచా కాల్చారు. ఆ సమయంలోనే ధ్వని, వాయు కాలుష్యం జరుగుతోందన్న ఆగ్రహం వ్యక్తమైంది. రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక భారతీయులు కాల్చిన బాణసంచా వ్యర్థాలు, బూడిద, అట్టపెట్టెలు, ఇతర చెత్తతో రోడ్లన్నీ నిండిపోయాయి. ఆ చెత్త తొలగింపు, రోడ్లు, వీధులను శుభ్రం చేయడం సమస్యగా మారింది. అక్కడి అధికారులు అగ్నిమాపక శకటాలను తీసుకొచ్చి శక్తివంతమైన నీటి క్యానన్ల ద్వారా శుభ్రం చేశారు. దీనంతటినీ చూడడానికి జనం గుమికూడటంతో పోలీసులు మళ్లీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇది విదేశాల్లో భారతీయ పండుగల నిర్వహణ, పౌర స్పృహపై చర్చకు దారితీసింది. భారతీయులు ప్రాచీన సంస్కృతి గురించి మాట్లాడుతున్నారే తప్ప... ఒక దేశంలో అతిథులుగా ఉంటున్నామన్న సంగతిని మరిచిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాగే చేస్తే అందర్నీ అమెరికా నుంచి మూకుమ్మడిగా పంపించివేయడం ఖాయమంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

దాడికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్..

Updated Date - Nov 11 , 2026 | 02:59 AM