Share News

మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. వెల్లడించిన నెతన్యాహు

ABN , Publish Date - Feb 16 , 2026 | 08:11 PM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటనకు గాను ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారంనాడు ఒక సదస్సులో విషయాన్ని వెల్లడించారు.

మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. వెల్లడించిన నెతన్యాహు
PM Modi, Benjamin Netanyahu

టెల్ అవివ్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రెండ్రోజుల పర్యటనకు గాను ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌ (Israel)లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) సోమవారంనాడు ఒక సదస్సులో విషయాన్ని వెల్లడించారు. 'పార్లమెంటులో కీలక ప్రసంగం ఉంటుంది. వచ్చే వారం ఇక్కడకు ఎవరు వస్తున్నారు? నరేంద్ర మోదీ' అని నెతన్యాహు పేర్కొన్నారు.


'భారత్-ఇజ్రాయెల్ మధ్య అద్భుతమైన మైత్రి ఉంది. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారంపై మేము చర్చించనున్నాం. మీకు తెలుసా.. ఇప్పుడు ఇండియా చిన్న దేశం కాదు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. చాలా శక్తివంతమైన దేశం, అపారమైన ప్రజాదరణ కలిగి ఉంది' అని నెతన్యాహు తెలిపారు.


నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల క్రితం 2017లో ఇజ్రాయెల్‌లో తొలిసారి పర్యటించారు. ఇరుదేశాల మధ్య 25 ఏళ్ల దౌత్య సంబంధాలకు గుర్తుగా ఆయన పర్యటన జరిపారు. భారత ప్రధానిగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించనుండటం ఇదే ప్రథమం. ప్రధాని తాజా పర్యటనతో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ, సాంకేతిక సంబంధాలు కొత్తపుంతలు తొక్కుతాయని అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు వెస్ట్ ఆసియాలో భద్రతా పరిస్థితిపై ఉభయదేశాల ప్రధానులు చర్చించనున్నారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై (బీఐటీ) కూడా ఇరుదేశాలు సంతకాలు చేయనున్నాయి.


ఇవి కూడా చదవండి..

రష్యా చమురు కొనబోమని భారత్‌ హామీ

ఆగండి.. మీ ఐడీ కార్డు చూపండి?

Updated Date - Feb 16 , 2026 | 08:20 PM