నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 11 , 2026 | 01:36 PM
నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఆదివారం గోర్ఖా జిల్లాలోని చుమ్నుబ్రి గ్రామంలో సంభవించిన వరదల ధాటికి 35కు పైగా ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోగా, ఓ జలవిద్యుత్ ప్రాజెక్టు దెబ్బతింది.
ఖాఠ్మాండూ: నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఆదివారం గోర్ఖా జిల్లాలోని చుమ్నుబ్రి గ్రామంలో సంభవించిన వరదల ధాటికి 35కు పైగా ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోగా, ఓ జలవిద్యుత్ ప్రాజెక్టు దెబ్బతింది. బుధి గండకి నదిలో నీటిమట్టం అనూహ్యంగా పెరగడంతో ఈ విపత్తు సంభవించింది. అయితే, వరదనీరు ఒక్కసారిగా ఇళ్లపైకి దూసుకురావడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ ప్రాధికార సంస్థ (NDRRMA) వివరాల ప్రకారం ఆదివారం ఉదయం 6:30 గంటలకు 3.66 మీటర్లుగా ఉన్న నది నీటిమట్టం.. ఉదయం 8:40 గంటలకు 8.43 మీటర్లకు చేరింది. నదిలో ప్రమాద స్థాయి 5 మీటర్లు కాగా, అంతకుమించి నీటిమట్టం పెరగడం ఆందోళన కలిగించింది. ఉదయం 8:30 నుంచి 8:40 గంటల మధ్య కేవలం పది నిమిషాల్లోనే నీటిమట్టం రెండు మీటర్లకు పైగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతికి నీటిమట్టాన్ని కొలిచే కేంద్రంతో పాటు అక్కడి వంతెన కూడా కొట్టుకుపోవడంతో తదుపరి వివరాలను సేకరించడం కష్టమైందని వెల్లడించారు.
ఈ వరదలకు వర్షం కారణం కాదని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నదికి ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి, ఆ తర్వాత అది ఒక్కసారిగా తెగిపోవడంతో భారీగా వరద నీరు దిగువకు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు, ప్రాథమిక పరిశీలనల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు ఎన్డీఆర్ఆర్ఎంఏ తెలిపింది. వరదకు అసలు కారణాన్ని నిర్ధారించేందుకు సాంకేతిక విశ్లేషణ కొనసాగుతోంది. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో నది నీరు నల్లగా, బూడిద రంగులో కనిపిస్తూ, భారీగా బురద, రాళ్లు, ఇతర శిథిలాలను మోసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న జగత్ ప్రాంతం నుంచి ఆరుగురిని విమానంలో సురక్షిత ప్రాంతానికి తరలించింది. కాగా, నదీ తీర ప్రాంతాల్లో, దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆదివారం సాయంత్రం వరకు నదీ తీరాలకు, ప్రమాదకర నివాస ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.
గత ఆగస్టులో నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో సంభవించిన భారీ వరదలు నేపాల్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. భోటేకోషి నదిలో ఉప్పొంగిన వరద నీరు ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలను కొట్టుకుపోయేలా చేసింది. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులూ దెబ్బతిన్నాయి. ఆ విపత్తులో 1,450 మందికి పైగా మరణించగా, 5,000 మందికి పైగా ఆచూకీ గల్లంతైనట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి. ఆ విషాదం నుంచి కోలుకోకముందే గోర్ఖా జిల్లాలో మరో ఆకస్మిక వరద నేపాల్‌లో ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
రియాద్ విమానాశ్రయంపై దాడి.. సౌదీకి సాయం గురించి అమెరికా ఆలోచన..
మీరు ప్రపంచానికి హీరో.. స్మిత్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి లేఖ