మీరు ప్రపంచానికి హీరో.. స్మిత్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి లేఖ
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:32 PM
ఫ్లైదుబాయ్ ఉదంతంలో విమానప్రయాణికులను కాపాడిన హీరో పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ ఉదంతంలో విమానప్రయాణికులను కాపాడిన హీరో పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అసమాన ధైర్యసాహసాలు కనబరిచిన వారికి ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డును తీసుకునేందుకు తమ దేశానికి రావాలని ఆహ్వానించారు. భారత్, ఇజ్రాయెల్‌లతో పాటు యావత్ మానవాళికి స్మిత్ ఒక హీరో అని కొనియాడారు. స్మిత్‌కు స్వాగతం పలికేందుకు తాను ఉత్సుకతతో ఉన్నానని చెప్పారు. తమ దేశ ప్రజల తరఫున అత్యున్నత పౌర పురస్కారాన్ని స్మిత్‌కు ఇచ్చే సందర్భం తనకు నిజంగా గర్వకారణమవుతుందని చెప్పారు. తన లేఖను స్మిత్ చదువుతున్న ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.
ఫ్లైదుబాయ్ విమాన ప్రమాదాన్ని తప్పించేందుకు అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించిన స్మిత్‌కు తమ దేశ ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నానని ఇజ్రాయెల్ అధ్యక్షుడు పేర్కొన్నారు. నాటి ఘటన గుర్తు చేసుకుంటే ఉత్కంఠ కలుగుతోందని, ఏ థ్రిల్లర్ సినిమాకూ తీసుపోని ఉదంతమని పేర్కొన్నారు. ప్రాణాల కోసం పోరాడుతూ కూడా ఇతరులను కాపాడే సమయంలో స్మిత్ ఎదుర్కొన్న భావోద్వేగాన్ని తాను అర్థం చేసుకున్నానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కోపైలట్ దాడిలో గాయపడి దుబాయ్ ఆసుపత్రిలో చేరిన కెప్టెన్ స్మిత్ ప్రస్తుతం మెల్లగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. గాయాల కారణంగా ఆయనకు బ్రెయిన్ సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు కూడా ఇజ్రాయెల్ అధ్యక్షుడు పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
రియాద్ విమానాశ్రయంపై దాడి.. సౌదీకి సాయం గురించి అమెరికా ఆలోచన..
రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. ఖండించిన భారత్