Share News

నేపాల్ వరదలు.. కనిపించని 93 మంది కార్మికుల ఆచూకీ..

ABN , Publish Date - Aug 31 , 2026 | 05:01 PM

భారీ వరదలకు రసువా జిల్లాలోని రసువాగఢి జలవిద్యుత్‌ ప్రాజెక్టు టన్నెల్‌లో చిక్కుకున్న 93 మంది కార్మికుల కోసం తీవ్రంగా సహాయక చర్యలు కొనసాగాయి. అయితే, కార్మికుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఫలించలేదు.

నేపాల్ వరదలు.. కనిపించని 93 మంది కార్మికుల ఆచూకీ..
Rasuwagadhi Hydropower Project Tunnel

ఖాఠ్మాండూ: భారీ వరదలకు రసువా జిల్లాలోని రసువాగఢి జలవిద్యుత్‌ ప్రాజెక్టు టన్నెల్‌లో చిక్కుకున్న 93 మంది కార్మికుల కోసం తీవ్రంగా సహాయక చర్యలు కొనసాగాయి. అయితే, కార్మికుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఫలించలేదు. నేపాలీ ఆర్మీ, ఇంజినీర్లు, డ్రోన్‌ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం టన్నెల్‌ చివరి వరకు వెళ్లి థర్మల్‌ డ్రోన్లతో విస్తృతంగా తనిఖీలు చేసినప్పటికీ ఎక్కడా ప్రాణాలతో ఉన్నవారి జాడ కనిపించలేదు.


ఆగస్టు 26న భోటే కోషి నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వరదలు సంభవించాయి. ఆ సమయంలో రసువాగఢి హైడ్రోపవర్‌ ప్రాజెక్టు టన్నెల్‌లో పనిచేస్తున్న కార్మికులు లోపలే చిక్కుకుపోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరదల అనంతరం నేపాలీ ఆర్మీ ఆధ్వర్యంలో సహాయక బృందాలు టన్నెల్‌లోకి ప్రవేశించి గాలింపు చేపట్టాయి. టన్నెల్‌లోని అత్యంత ప్రమాదకర ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించడం కష్టంగా ఉండటంతో థర్మల్‌ డ్రోన్లను రంగంలోకి దించారు. డ్రోన్ల బృందం టన్నెల్‌ చివరి భాగం వరకు చేరుకుని లోపలి ప్రాంతాలను పరిశీలించింది. అయితే, మనుషులు ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు లభించలేదు. దీంతో గాలింపు చర్యలను నిలిపివేసినట్లు నేపాల్‌ ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం వెల్లడించింది.


కాగా, అనేక జలవిద్యుత్ ప్రాజెక్టుల్లోని భూగర్భ టన్నెల్‌లలో వందలాది మంది కార్మికులు పనిచేస్తుండగా వరదలు ముంచెత్తాయి. దీంతో భారీగా ప్రాణనష్టం, గల్లంతైన వారి సంఖ్య పెరుగుతోంది. జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన 933 మంది కార్మికులు గల్లంతైనట్లు నేపాల్‌ ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఇప్పటివరకు వివిధ హైడ్రోపవర్‌ ప్రాజెక్టుల టన్నెల్‌ల నుంచి 279 మందిని రక్షించినట్లు వెల్లడించింది. అయితే, వరదలు వచ్చినప్పుడు మిగిలిన కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకున్నారా?, సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారా?, వరద ప్రవాహంలో కొట్టుకుపోయారా? అన్నది స్పష్టంగా తెలియడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇరాన్ లారక్ ఐలాండ్‌పై అమెరికా దాడులు.. మూల్యం తప్పదన్న ఐఆర్‌జీసీ..

అమెరికాలో వరద బీభత్సం.. 20 మందికి పైగా గల్లంతు

Updated Date - Aug 31 , 2026 | 05:11 PM