అమెరికాలో వరద బీభత్సం.. 20 మందికి పైగా గల్లంతు
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:19 AM
అమెరికాలో ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన గ్రాండ్ కాన్యన్‌లో ఊహించని విపత్తు సంభవించింది. ఒక్కసారిగా వచ్చిన వరద నీరు భారీగా విధ్వంసం సృష్టించడంతో 20 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. వరద బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్కులో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో శనివారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ఉద్ధృత ప్రవాహం కారణంగా.. పాదచారుల వంతెనలు, పెద్ద బండరాళ్లు, లోహ నిర్మాణాలు, ఇతర శిథిలాలు కొలరాడో నదిలోకి కొట్టుకుపోయాయి. వరద ప్రవాహం కారణంగా క్రీక్ రూపమే పూర్తిగా మారిపోయిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
వరద ప్రభావిత ప్రాంతం నుంచి ఫాంటమ్ రాంచ్‌లో ఉన్న 62 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలపై అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే భారీ వర్షాల కారణంగా మరిన్ని ఆకస్మిక వరదలు, శిథిలాల ప్రవాహాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. నష్టాన్ని అంచనా వేసేందుకు బ్రైట్ ఏంజెల్ క్యాంప్‌గ్రౌండ్, ఫాంటమ్ రాంచ్, నార్త్ కైబాబ్ ట్రైల్‌లోని కొన్ని ప్రాంతాలను మూసివేయడంతో పాటు కొలరాడో నదిపై రాఫ్టింగ్ యాత్రలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇవి కూడా చదవండి
కౌంటీ ఛాంపియన్‌షిప్: ఆకిబ్ నబీకి సర్‌ప్రైజ్ ఛాన్స్.. సర్రే జట్టు తరఫున..
వచ్చే నెలలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం