డార్క్ ఎనర్జీ నుంచి కొత్త గ్రహాల వరకు.. విశ్వ రహస్యాల వేటలో నాసా కొత్త టెలిస్కోప్..
ABN , Publish Date - Aug 30 , 2026 | 09:03 PM
అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ముందడుగు పడింది. నాసా రూపొందించిన నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్‌ను ఆదివారం విజయవంతంగా ప్రయోగించారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ముందడుగు పడింది. నాసా రూపొందించిన నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్‌ను ఆదివారం విజయవంతంగా ప్రయోగించారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఈ ప్రయోగం జరిగింది (NASA Roman Space Telescope).
ఈ రోమన్ టెలిస్కోప్ ప్రధానంగా డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, సౌర వ్యవస్థకు వెలుపల ఉన్న గ్రహాల (ఎగ్జోప్లానెట్లు)పై పరిశోధనలు చేయనుంది. విశ్వం ఎలా విస్తరిస్తోంది? ఆ విస్తరణ వేగం ఎందుకు పెరుగుతోంది? విశ్వంలో పదార్థం ఎలా విస్తరించి ఉంది? వంటి కీలక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు రోమన్ టెలిస్కోప్ సహాయపడనుంది. ఇప్పటికే ఉన్న హబుల్ స్పేస్ టెలిస్కోప్‌తో పోలిస్తే కనీసం 100 రెట్లు ఎక్కువ ప్రాంతాన్ని ఈ రోమన్ టెలిస్కోప్ ఒకేసారి పరిశీలించగలదు (Roman Telescope launch).
హబుల్‌కు సమానమైన ఇమేజ్ రిజల్యూషన్‌తో, చాలా విస్తృతమైన ఆకాశ ప్రాంతాలను వేగంగా స్కాన్ చేయగల సామర్థ్యం ఈ రోమన్ టెలిస్కోప్‌నకు ఉంది. నాసా అంచనాల ప్రకారం రోమన్ టెలిస్కోప్ తన మిషన్‌లో బిలియన్ల కొద్దీ గెలాక్సీలను పరిశీలించనుంది. విశ్వానికి సంబంధించిన భారీ 3డీ మ్యాప్‌ను రూపొందించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. రోమన్ టెలిస్కోప్ మరో ముఖ్య లక్ష్యం ఎగ్జోప్లానెట్ల అన్వేషణ. మన సౌర వ్యవస్థకు వెలుపల ఉన్న గ్రహాలను గుర్తించేందుకు ఇది ప్రత్యేకమైన మైక్రో లెన్సింగ్ పద్ధతిని ఉపయోగించనుంది.
ఈ విశ్వం వేగవంతమైన విస్తరణకు కారణంగా భావిస్తున్న 'డార్క్ ఎనర్జీ' ఇప్పటికీ అతిపెద్ద మిస్టరీగా ఉంది. విశ్వంలోని మొత్తం పదార్థం, శక్తిలో డార్క్ ఎనర్జీ వాటా సుమారు 68 శాతం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే అది అసలు ఏమిటి, కాలక్రమంలో దాని ప్రభావం ఎలా మారింది అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఈ రోమన్ టెలిస్కోప్ దూర గెలాక్సీలు, సూపర్‌నోవాలు, గెలాక్సీ క్లస్టర్లను పరిశీలించడం ద్వారా డార్క్ ఎనర్జీ రహస్యాలను తెలుసుకోనుంది (NASA space telescope dark energy).
ప్రయోగం అనంతరం రోమన్ టెలిస్కోప్ తన తుది కక్ష్యకు చేరుకునేందుకు సుమారు మూడు నెలల సమయం పడుతుంది. దాదాపు 10 లక్షల మైళ్ల ప్రయాణం చేసి 'సన్ ఎర్త్ ఎల్-2' ప్రాంతంలో ఇది పనిచేయనుంది. అక్కడి నుంచి విశ్వాన్ని విస్తృతంగా పరిశీలిస్తూ డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, గెలాక్సీలు, నక్షత్రాలు, ఎగ్జోప్లానెట్లపై భారీ స్థాయిలో డేటాను సేకరించనుంది.
ఇవి కూడా చదవండి..
బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లి రిజిస్ట్రేషన్.. చైనాలో ఎందుకిలా చేస్తున్నారంటే..
పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, ఆమె సోదరిపై యాసిడ్ దాడి..