Share News

మీరు ఉగ్రవాది.. న్యూయార్క్‌లో మహమ్మద్‌ యూనస్‌కు నిరసన సెగ..

ABN , Publish Date - Oct 13 , 2026 | 01:32 PM

బంగ్లాదేశ్‌ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌కు అమెరికాలో నిరసన సెగ తగిలింది. న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొందరు బంగ్లాదేశ్‌ ప్రవాసులు ఆయనను నిలదీశారు.

మీరు ఉగ్రవాది.. న్యూయార్క్‌లో మహమ్మద్‌ యూనస్‌కు నిరసన సెగ..
Muhammad Yunus

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌కు అమెరికాలో నిరసన సెగ తగిలింది. న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొందరు బంగ్లాదేశ్‌ ప్రవాసులు ఆయనను నిలదీశారు. 'మీరు ఉగ్రవాది.. బంగ్లాదేశ్‌లో ప్రజలను చంపారు.. ఇక్కడికి ఎందుకు వచ్చారు?' అంటూ ప్రశ్నించారు (Muhammad Yunus JFK Airport Protest).


బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచారని, వేలాది మంది పోలీసుల మరణాలకు బాధ్యత వహించాలని కొందరు నినాదాలు చేశారు. అక్టోబర్‌ 12న మహమ్మద్‌ యూనస్‌ ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో దోహా నుంచి న్యూయార్క్‌ చేరుకున్నారు. జేఎఫ్‌కే విమానాశ్రయంలోని టెర్మినల్‌-8 నుంచి యూనస్ వీల్‌చైర్‌లో వెళ్తుండగా కొందరు ఆయన వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో వేలాది మంది పోలీసుల మరణాలు, పెద్ద సంఖ్యలో అరెస్టుల అంశాలను కూడా ప్రస్తావించారు (Yunus Protest).


భద్రతా సిబ్బంది యూనస్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. కొందరు నిరసనకారులు ఆయనను వెనక్కి వెళ్లాలని డిమాండ్‌ చేశారు (Bangladesh Interim Government). బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత 2024 ఆగస్టు 8న మహమ్మద్‌ యూనస్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు, రాజకీయ హింస, అరెస్టులు, మైనారిటీల భద్రత వంటి అంశాలపై విమర్శలు వెల్లువెత్తాయి.


అలాగే యూనస్‌ తాత్కాలిక ప్రభుత్వ హయాంలో భారత్‌-బంగ్లాదేశ్‌ సంబంధాలూ బలహీనమయ్యాయి. 2025 మార్చిలో చైనా పర్యటన సందర్భంగా భారత ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక స్థితి, ప్రాంతీయ వాణిజ్య అవకాశాలపై యూనస్‌ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.

ఇవి కూడా చదవండి..

రోహిత్, కోహ్లీ మాత్రమే కాదు.. 2027 ప్రపంచకప్‌లో అసలైన బలం ఇదే: మహమ్మద్ కైఫ్


ప్రతిపక్ష కూటమి పిటిషన్‌లో 14 లోపాలు.. కోర్టు ఫీజులో రూ.220 తక్కువగా చెల్లింపు..

Updated Date - Oct 13 , 2026 | 02:00 PM