ఇరాన్ సుప్రీం లీడర్ జీవించే ఉన్నారు.. అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన!
ABN , Publish Date - Jun 03 , 2026 | 07:48 AM
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సజీవంగానే ఉన్నారని, ఆయన దేశ వ్యవహారాల్లో మరింత చురుగ్గా పాల్గొంటున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీకి ఈ మేరకు ఆయన ఈ తాజా అప్‌డేట్ ఇచ్చారు.
వాషింగ్టన్, మే 3: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నారని, అమెరికాతో జరుగుతున్న చర్చల ప్రక్రియలో ఆయన మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అమెరికా సెనేట్ ఫారిన్ రిలేషన్స్ ప్యానెల్ ఎదుట ప్రసంగిస్తూ రూబియో ఈ సంచలన విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడులలో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, పలువురు సైనిక కమాండర్లు మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్చి నెలలో ఆయన కుమారుడైన మొజ్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ దాడుల సమయంలో మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని, ఆ తర్వాత ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన జీవించే ఉన్నారా లేదా అనేదానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అంతర్జాతీయంగా అనేక ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ఊహాగానాలకు తెరదించుతూ మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. 'మొజ్తబా ఖమేనీ ఇరాన్ అంతర్గత, దౌత్యపరమైన విషయాలలో ఏదో ఒక స్థాయిలో నిరంతరం జోక్యం చేసుకుంటున్నారనే సంకేతాలు మాకు అందుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్ ఉన్న పరిస్థితుల్లో అక్కడి నాయకులు బహిరంగంగా బయటకు రావడం క్షేమకరం కాదని ఆ దేశ అంతర్గత వర్గాలు భావిస్తుండొచ్చు. కానీ, ఆయన కచ్చితంగా సజీవంగానే ఉన్నారు' అని రూబియో పేర్కొన్నారు. ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. సుప్రీం లీడర్ అనుమతి లేకుండా దేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు జరగవని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
‘సర్’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు