మధ్యప్రాచ్యంలో భారీ సైనిక బలగాల సమీకరణ చేస్తున్న అమెరికా
ABN , Publish Date - Feb 18 , 2026 | 09:06 AM
ఒకవైపు ఇరాన్‌తో అణు చర్చలు జరుపుతూనే.. అమెరికా మధ్యప్రాచ్య ప్రాంతంలో తన సైనికశక్తిని విపరీతంగా పెంచుతోంది. గత 24 గంటల్లోనే 50కి పైగా ఫైటర్ జెట్‌లను ఈ ప్రాంతానికి తరలించినట్లు అధికారిక వర్గాలు, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ఆధారంగా తెలుస్తోంది.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 18: ఇరాన్‌తో అణు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా మధ్యప్రాచ్య(పశ్చిమ ఆసియాలోని ఎక్కువ భాగం) ప్రాంతంలో తన సైనికశక్తిని భారీగా పెంచుతోంది. గత 24 గంటల్లోనే 50కి పైగా ఫైటర్ జెట్‌లను ఈ ప్రాంతానికి తరలించినట్లు అధికారిక వర్గాలు, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ఆధారంగా తెలుస్తోంది. ఈ జెట్‌లలో అత్యాధునిక F-22 రాప్టర్, F-35 లైట్‌నింగ్ II, F-16 ఫైటింగ్ ఫాల్కన్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటితోపాటు అనేక ఏరియల్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్లూ తరలించారు. దీనిని దీర్ఘకాలిక ఆపరేషన్లకు సిద్ధం చేస్తున్న సంకేతంగా సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇంతకుముందే మధ్యప్రాచ్యంలో ఉన్న యూఎస్ఎస్ అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌తోపాటు, ఇప్పుడు రెండో క్యారియర్ గ్రూప్ కూడా ఆ ప్రాంతం వైపు బయలుదేరింది. యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్.ఫోర్డ్ (ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక) క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కరీబియన్ నుంచి బయలుదేరి ప్రస్తుతం మధ్య అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ఇది మూడు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లతో (యూఎస్ఎస్ మహాన్, యూఎస్ఎస్ బైన్‌బ్రిడ్జ్, యూఎస్ఎస్ విన్‌స్టన్ చర్చిల్) కలిసి ప్రయాణిస్తోంది.
ఈ గ్రూప్ ఇరాన్ సమీప జలాలకు చేరుకోవడానికి ఇంకా ఒక వారం పైగా సమయం పట్టవచ్చని అంచనా. ఈ భారీ సమీకరణ జెనీవాలో జరుగుతున్న అమెరికా-ఇరాన్ అణు చర్చల రెండో రౌండ్‌తో సమాంతరంగా జరుగుతోంది. ఇలా ఉండగా, చర్చల్లో కొంత పురోగతి సాధించినట్లు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. 'పురోగతి ఉంది, కానీ ఇంకా చాలా వివరాలు చర్చించాలి. ఇరాన్ రెండు వారాల్లో వివరణాత్మక ప్రతిపాదనలతో తిరిగి వస్తామని చెప్పింది' అని ఆయన అన్నారు. చర్చలు దాదాపు మూడు గంటలపాటు జరిగాయని ఇరాన్ స్టేట్ టెలివిజన్ తెలిపింది.
అయితే, ఈ చర్చల నేపథ్యంలోనే ఇరాన్ హార్ముజ్ జలసంధిలో లైవ్ ఫైర్ సైనిక విన్యాసాలు చేపట్టి, కొన్ని భాగాలను మూసివేసింది. ఇది ప్రపంచ ఆయిల్ రవాణాకు కీలకమైన మార్గం కావడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. గత నెలలో ఇరాన్‌లో నిరసనకారులపై జరిగిన దాడుల మీద ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అణు కార్యక్రమాలపై బలప్రయోగం చేస్తామనీ హెచ్చరించారు. ప్రస్తుతం చేస్తున్న భారీ సైనిక సమీకరణ ఇరాన్ మీద దౌత్యపరమైన చర్చలతోపాటు సైనిక ఒత్తిడి కూడా అమెరికా తీసుకువస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం