Share News

ఆస్ట్రేలియాలో ఘోరం.. మహాత్మా గాంధీ విగ్రహాన్ని కత్తిరించుకుపోయారు

ABN , Publish Date - Feb 03 , 2026 | 09:34 PM

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారత జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని దొంగలు కాళ్ల వరకూ కత్తిరించుకుపోయారు. ఇటీవల ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ సంబంధిత యాంటీ-ఇండియా సెంటిమెంట్ పెరిగిన నేపథ్యంలో ఇది పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఆస్ట్రేలియాలో ఘోరం.. మహాత్మా గాంధీ విగ్రహాన్ని కత్తిరించుకుపోయారు
Gandhi statue stolen Melbourne

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 3: ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరం మెల్‌బోర్న్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 420 కిలోల బరువైన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని దొంగలు ఎత్తికెళ్లిపోయారు. మెల్‌బోర్న్‌ సబర్బ్ రోవ్‌విల్‌లోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ బయట ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని చోరీ చేశారు. గాంధీ విగ్రహాన్ని ముగ్గురు దుండగులు కాళ్ల వరకు కత్తిరించి తీసుకుపోయారు. ఈ ఘటన జనవరి 12 రాత్రి 12:50 గంటల సమయంలో జరిగింది.


ఎలా జరిగింది?

ముసుగులు ధరించిన ముగ్గురు గుర్తుతెలియని దుండగులు కటింగ్ మెషిన్ ఉపయోగించి విగ్రహాన్ని పాదాల వద్ద కత్తిరించారు. దీంతో విగ్రహం బేస్ నుంచి తెగిపోయి, కేవలం అక్కడ పాదాలు మాత్రమే మిగిలాయి. CCTV ఫుటేజ్‌లో ఒక వైట్ వ్యాన్‌లో వచ్చిన దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యుడు సంతోష్ కుమార్.. పోలీసులకు అందజేశారు. భారత జాతీయ నాయకుడి విగ్రహాన్ని ఇలా కట్ చేసి తీసుకెళ్లడం చాలా బాధాకరమని ఆయన వాపోయారు.

ఈ విగ్రహం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) న్యూఢిల్లీ నుంచి బహుమతిగా వచ్చింది. 2021 నవంబర్ 12న అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ చేత ఈ విగ్రహం ఆవిష్కరించబడింది. ఇండియన్-ఆస్ట్రేలియన్ కమ్యూనిటీకి సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఈ కేసును విక్టోరియా పోలీస్ నాక్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ దర్యాప్తు చేస్తోంది. స్క్రాప్ మెటల్ డీలర్లను అప్రమత్తం చేసి, బ్రాంజ్ విగ్రహాన్ని అమ్మడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే రిపోర్ట్ చేయమని కోరారు.

అయితే, ఈ ఘటన వెనకున్న ఉద్దేశ్యం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ ఇటీవల ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ సంబంధిత యాంటీ-ఇండియా సెంటిమెంట్ పెరిగిన నేపథ్యంలో పలు ఘటనలు వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఈ ఘటనను ఖండించి, విగ్రహాన్ని త్వరగా రికవర్ చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఘటన ఇండియన్ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది.


ఇవీ చదవండి:

ప్రియుడి కోసం జంట హత్యలు

సర్పంచ్‌గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు

Updated Date - Feb 03 , 2026 | 09:53 PM