Share News

ప్రియుడి కోసమే జంట హత్యలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:11 AM

తల్లీ కుమారుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడి భార్యను చంపేస్తేనే అతడు తనకు దగ్గరవుతాడని నిందితురాలు ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు...

ప్రియుడి కోసమే జంట హత్యలు

  • తల్లీ కుమారుడిపై పెట్రోలు పోసి..చంపిన ఘటనలో నిందితురాలి అరెస్టు

మర్రిగూడ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): తల్లీ కుమారుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడి భార్యను చంపేస్తేనే అతడు తనకు దగ్గరవుతాడని నిందితురాలు ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. కేసు వివరాలను సీఐ దూది రాజు వెల్లడించారు. కేతేపల్లికి చెందిన కుందేలు నగేశ్‌కు భార్య మమత, ఇద్దరు కుమారులు రిత్విక్‌ నందన్‌(3), అద్విక్‌ నందన్‌(6 నెలలు) ఉన్నారు. వివాహానికి ముందు నుంచే అదే గ్రామానికి చెందిన మీసాల సుజాతతో నగేశ్‌ సన్నిహితంగా ఉంటున్నాడు. సుజాతకు ఇద్దరు కుమార్తెలు. పదేళ్ల క్రితం భర్త మృతిచెందటంతో స్వగ్రామం కేతేపల్లిలో ఉంటోంది. తన భర్త సుజాతతో సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని మమత కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో పెద్దలు వారిద్దరినీ మందలించారు. అప్పటి నుంచి నగేశ్‌.. సుజాతకు దూరంగా ఉంటున్నాడు. దీంతో మమతను హత్య చేస్తే ప్రియుడు తనకు దగ్గరవుతాడనే ఆలోచనతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకు సుజాత పథకం వేసింది. జనవరి 31న గ్రామంలో ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లి బాటిల్‌లో పెట్రోలు కొనుగోలు చేసింది. ఆ రోజు నగేశ్‌ తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా, ఇంటి వద్ద మమత, ఆమె కుమారులు, నగేశ్‌ నానమ్మ ఉన్నారు. మమత ఇంటి ముందు ఆరు నెలల అద్విక్‌ నందన్‌కు పాలు ఇస్తుండగా, మరో కుమారుడు దూరంగా ఆడుకుంటున్నాడు. ఇదే అదనుగా భావించిన సుజాత వెనక నుంచి మమతపై పెట్రోలు పోసి నిప్పంటించింది. మంటలకు తాళలేక మమత అక్కడే మృతిచెందగా, ఆరు నెలల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు చనిపోయాడు. నాటి నుంచి పరారీలో ఉన్న సుజాతను పోలీసులు పట్టుకున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 03:11 AM