సర్పంచ్‌గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:51 AM
సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉందని ఓ తండ్రి ఏకంగా కన్నకూతురినే చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ముగ్గురు పిల్లలుంటే అర్హత ఉండదని ఘాతుకం
ఆరేళ్ల పాపను నిజాంసాగర్ కెనాల్‌లో తోసేసిన మహారాష్ట్రకు చెందిన పాండురంగ
గత నెల 29న నిజామాబాద్ జిల్లాలో మృతదేహం లభ్యం
హత్య కేసును ఛేదించిన బోధన్ పోలీసులు
నిజామాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉందని ఓ తండ్రి ఏకంగా కన్నకూతురినే చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని కేరూర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు చిన్నారిని తీసుకొచ్చి, నిజాంసాగర్ కెనాల్‌లోకి తోసేసి వెళ్లిపోయాడు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్న బోధన్ పోలీసులు.. ఇది హత్య కేసని తేల్చారు. నిజామాబాద్ సీపీ సాయిచైతన్య సోమవారం ఈ కేసు వివరాలను తెలియజేశారు. మహారాష్ట్రలోని ముఖేడ్ తాలూకా కేరూర్‌కు చెందిన కొండమంగలే పాండురంగ సెలూన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో కేరూర్ సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్నాడు. ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అర్హత ఉండదని భావించి, తన కూతురు ప్రాచీ(6)ని గత నెల 29న నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వద్దకు తీసుకొచ్చి నిజాంసాగర్ కెనాల్‌లోకి తోసివేసి పరారయ్యాడు. చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి పాప సంబంధీకుల కోసం గాలించారు. సోషల్ మీడియా గ్రూపుల్లో సమాచారం షేర్ చేయగా సుధీర్ అనే కానిస్టేబుల్ వాట్సాప్ స్టేట్‌సను ముఖేడ్ గ్రామస్థులు చూసి పాపను గుర్తించి సమాచారం ఇచ్చారు. పోలీసులు ముఖేడ్ వెళ్లి పాప పాండురంగ కూతురని గుర్తించారు. అతనికి తొలి సంతానంగా కవలలు(ఆడపిల్లలు), తర్వాత మరో బాబు ఉన్నాడు. అయితే ముుగ్గురు పిల్లలు ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అర్హత ఉండదని.. బాబును ఎవరికైనా దత్తత ఇవ్వాలని ప్రయత్నించాడు. పుణె కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి బర్త్ సర్టిఫికెట్‌ను కూడా మార్చే ప్రయత్నం చేశాడు. అది మారదని తెలిసిన తర్వాత ప్రస్తుత కేరూర్ సర్పంచ్ షిండే గణేశ్‌తో కలిసి ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి, తప్పిపోయినట్లు చెప్పాలని పన్నాగం పన్నాడు. కవల పిల్లల్లో చిన్నారి ప్రాచీని మాయమాటలు చెప్పి సర్పంచ్ గణేశ్‌తో తన బైక్‌పై నిజామాబాద్ తీసుకొస్తూ మార్గమధ్యలో ఎడపల్లి వద్ద నిజాంసాగర్ కెనాల్‌లో తోసేసి పారిపోయారు. పాండురంగ, గణేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన బోధన్ పోలీసులను సీపీ అభినందించారు.