Share News

లండన్‌లో హైటెన్షన్.. ఎస్‌ఎఫ్‌ఐ, మోదీ మద్దతుదారుల పోటాపోటీ నిరసనలు..

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:41 PM

భారత రాజకీయ పరిణామాలు బ్రిటన్‌లోనూ నిరసనలకు దారితీశాయి. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ యూకే విభాగం నిరసన చేపట్టింది.

లండన్‌లో హైటెన్షన్.. ఎస్‌ఎఫ్‌ఐ, మోదీ మద్దతుదారుల పోటాపోటీ నిరసనలు..
UK protest

ఇంటర్నెట్ డెస్క్: భారత రాజకీయ పరిణామాలు బ్రిటన్‌లోనూ నిరసనలకు దారితీశాయి. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ యూకే విభాగం నిరసన చేపట్టింది. భారత ఎన్నికల వ్యవస్థ, ఓటర్ల జాబితాల సవరణ, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా ఈ నిరసనలకు కేంద్రబిందువుగా నిలిచాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మరో బృందం కౌంటర్ నిరసన నిర్వహించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఇరువర్గాల మధ్య భద్రతా ఏర్పాట్లు చేశారు (London Indian High Commission protest).


ఎస్‌ఎఫ్‌ఐ యూకే ఆధ్వర్యంలో నిర్వహించిన 'స్టాండ్ ఇన్ సాలిడారిటీ' నిరసనలో పాల్గొన్నవారు భారత ప్రజాస్వామ్యం, ఓటు హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ జవాబుదారీతనం కోసం నినాదాలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీజేపీ సహా పలు వర్గాలు లేవనెత్తిన డిమాండ్లకు మద్దతు ప్రకటించడమే ఆ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులు 'ఆజాదీ', 'సారే జహాన్ సే అచ్ఛా' వంటి నినాదాలు చేశారు. ఓటర్ల హక్కులను కాపాడాలని, నిరసనకారులపై పోలీసుల చర్యలకు జవాబుదారీతనం ఉండాలని ఎస్‌ఎఫ్‌ఐ యూకే డిమాండ్ చేసింది (SFI UK protest).


ఎస్‌ఎఫ్ఐ విద్యార్థుల నిరసనకు ప్రతిగా భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపే మరో బృందం అక్కడికి చేరుకుంది (Modi supporters London). వారు 'భారత్ మాతా కీ జై', 'మోదీ.. మోదీ..' అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ భారీ చిత్రపటాన్ని కూడా ప్రదర్శించారు. ఇరువర్గాలూ భారత జాతీయ జెండాలను చేతబట్టి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. లండన్‌కు చెందిన వ్యాపారవేత్త రాహుల్ కాలే ఈ కౌంటర్ నిరసనలో పాల్గొన్నారు. ఇరువర్గాలు నినాదాలతో తమ వాదనలు వినిపించాయి. ఒకరి నినాదాలకు మరొకరు ప్రతినినాదాలు చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన, కౌంటర్ నిరసన ఒకే ప్రాంతంలో జరగడంతో లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఇరువర్గాల మధ్య దూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


ఐదు రోజులకే పదవి పోయింది.. ట్రంప్ సంచలన నిర్ణయం!

Updated Date - Oct 17 , 2026 | 12:41 PM