Share News

విశ్వసుందరిగా ప్యూర్టోరికో భామ.. జెన్నిఫర్‌ బారెటోకు కిరీటం!

ABN , Publish Date - Nov 25 , 2026 | 11:58 AM

ప్యూర్టో రికోకు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో మిస్ యూనివర్స్ 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఏడేళ్ల కుమార్తెకు తల్లిగా ఈ అంతర్జాతీయ అందాల పోటీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఆమె విద్యార్హతలు, ఉద్యోగం, వ్యక్తిగత జీవితం గురించి పూర్తివివరాలు..

విశ్వసుందరిగా ప్యూర్టోరికో భామ.. జెన్నిఫర్‌ బారెటోకు కిరీటం!

శాన్‌జువాన్‌: 75వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు ముగిశాయి. ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్‌ బారెటో విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది విజేత, మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్‌.. జెన్నిఫర్‌కు కిరీటాన్ని అలంకరించారు. ప్యూర్టోరికో రాజధాని శాన్‌జువాన్‌లో జరిగిన ఈ పోటీల్లో 116 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్‌ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. భారత్‌ తరఫున బరిలోకి దిగిన కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్‌ మెజో టాప్‌-30లో చోటు దక్కించుకున్నారు. అయితే, టాప్‌-12లోకి చేరలేకపోయారు.


నాయకుల నుంచి ప్రపంచం ఏం కోరుకుంటోంది?

ఫైనల్‌ రౌండ్‌లో ఐదుగురు పోటీదారులకు ‘ప్రస్తుతం ప్రపంచానికి నాయకుల నుంచి ఏం కావాలి?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి జెన్నిఫర్‌ సమాధానమిస్తూ.. వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు ఇతరుల పట్ల సానుభూతి కలిగిన నాయకులు ప్రపంచానికి అవసరమని పేర్కొన్నారు. ఇతరులను విమర్శించే బదులు వారి పరిస్థితులను అర్థం చేసుకోవాలని, తమ విలువలకు కట్టుబడి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఆమె సమాధానం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.


చదువులోనూ ముందంజ.. సేవా కార్యక్రమాల్లోనూ చురుకు

జెన్నిఫర్‌ బారెటో వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిపరంగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 27 ఏళ్ల ఆమెకు వివాహమైంది. పెనెలోప్‌ అనే ఏడేళ్ల కుమార్తె ఉంది. సైకాలజీ, క్లినికల్‌ సోషల్‌ వర్క్‌లో రెండు మాస్టర్స్‌ డిగ్రీలు పూర్తిచేశారు. ప్రస్తుతం అమెరికా రక్షణ శాఖలోని ఆర్మీ విభాగంలో ప్రివెన్షన్‌ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించడం ఆమె విధుల్లో భాగం. మరోవైపు పుస్తకాలు చదవడం, వాలీబాల్‌ ఆడటం ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. ప్యూర్టోరికోలో పలు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా చిన్నారుల డయాబెటిస్‌ అసోసియేషన్‌తో కలిసి మధుమేహంతో బాధపడుతున్న పిల్లలు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ.. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.


Also Read:

విశ్వసుందరిగా ప్యూర్టోరికో భామ.. జెన్నిఫర్‌ బారెటోకు కిరీటం!

యువీ ఇచ్చిన సలహాలతో చెలరేగిపోయా: వైభవ్

కీలక పరిణామం.. దలై లామాకు కేంద్ర ప్రభుత్వ భవనం కేటాయింపు

Updated Date - Nov 25 , 2026 | 12:08 PM