Share News

హెజ్‌బొల్లా భారీ భూగర్భ డ్రోన్ ఫ్యాక్టరీని కనుగొన్న ఇజ్రాయెల్ సైన్యం

ABN , Publish Date - Jun 22 , 2026 | 03:48 PM

దక్షిణ లెబనాన్‌లోని ఓ పర్వతం కింద హెజ్‌బొల్లాకు చెందిన ఒక భారీ భూగర్భ డ్రోన్ కేంద్రాన్ని ఇజ్రాయెల్ దళాలు కనుగొన్నాయి. ఇందులో భారీ ఆయుధ సంపత్తి ఉంది. గతంలో కనుగొన్న ఇతర హెజ్‌బొల్లా సొరంగాల కంటే ఇది చాలా అత్యాధునికమైందని సమాచారం.

హెజ్‌బొల్లా భారీ భూగర్భ డ్రోన్ ఫ్యాక్టరీని కనుగొన్న ఇజ్రాయెల్ సైన్యం
Israeli Troops Discover Hezbollah's Underground Drone Factory Beneath Mountain in Lebanon

టెల్ అవీవ్/బీరుట్, జూన్ 22: దక్షిణ లెబనాన్‌లోని పర్వత శ్రేణుల కింద అత్యంత రహస్యంగా నిర్మించిన హెజ్‌బొల్లాకు చెందిన ఒక భారీ భూగర్భ డ్రోన్ కర్మాగారాన్ని ఇజ్రాయెల్ సైన్యం కనుగొంది. ఇజ్రాయెల్ సరిహద్దుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'మజ్దల్ జౌన్' అనే గ్రామంలోని భారీ పర్వతం కింద ఈ సొరంగాల నెట్‌వర్క్‌ను గుర్తించినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.

'ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' కథనం ప్రకారం.. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో ఇక్కడ డ్రోన్‌లను అసెంబుల్ చేయడంతో పాటు వాటిని ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించేందుకూ ఈ కేంద్రాన్ని హెజ్‌బొల్లా ఉపయోగించేది. ఇరాన్ ప్రత్యక్ష నిధులు, ప్రణాళికతో గత దశాబ్ద కాలంగా ఈ కేంద్రాన్ని నిర్మించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.


పర్వతం కింద దాగివున్న వైమానిక స్థావరం

జర్నలిస్టులను ఈ ప్రాంతానికి తీసుకెళ్లిన ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు అక్కడి పరిస్థితులను వివరించారు. ఈ సొరంగాల కాంప్లెక్స్.. పర్వతం లోపలికి వందల మీటర్ల పొడవున వ్యాపించి ఉంది. ఇది భూగర్భంలో దాదాపు 29 మీటర్ల లోతులో నిర్మితమైంది. భారీ పేలుళ్లను తట్టుకునే తలుపులతో ఈ కేంద్రాన్ని డిజైన్ చేశారు. ఇప్పటివరకు హెజ్‌బొల్లాకు సంబంధించి కనుగొన్న సొరంగాల అన్నిటికంటే ఇది అత్యంత అత్యాధునికమైనదని సైన్యం తెలిపింది.


స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాలు, డ్రోన్లు

ఈ భూగర్భ ఫ్యాక్టరీలో ఇజ్రాయెల్ సైన్యానికి భారీగా ఆయుధ సంపత్తి దొరికింది. దాదాపు 30 కిలోల బరువున్న పేలుడు పదార్థాలు అమర్చిన సుమారు 50 డ్రోన్‌లను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇవి ఇజ్రాయెల్‌లోని ఏ ప్రాంతంపైన అయినా దాడి చేయగల సామర్థ్యం ఉన్నవని అధికారులు తెలిపారు. వీటితో పాటు సొరంగం లోపల దాదాపు 8 టన్నుల అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను కూడా కనుగొన్నారు.

ఇలాంటి డ్రోన్లు పూర్తిగా సురక్షితమైన స్థితిలో ఇజ్రాయెల్ దళాల చేతికి చిక్కడం ఇదే మొదటిసారి. దీనివల్ల హెజ్‌బొల్లా సాంకేతిక సామర్థ్యానికి సంబంధించిన కీలక ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించే అవకాశం దక్కిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.


భూగర్భం నుంచే నేరుగా ప్రయోగాలు

ఈ స్థావరాన్ని డ్రోన్ ఫ్యాక్టరీ, 'ఎయిర్ బేస్' కలయికగా సైన్యం అభివర్ణించింది. పర్వతపు దక్షిణ భాగంలో డ్రోన్లను ప్రయోగించడానికి వీలుగా ప్రత్యేక లాంచ్ షాఫ్ట్‌లను ఏర్పాటు చేశారు.

'సొరంగం చివరన పట్టాలపై కదిలే బ్లాస్ట్ డోర్లతో అత్యంత పటిష్ఠమైన నాలుగు ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు ఈ తలుపులు తెరిచి, ఇజ్రాయెల్ వైపు నేరుగా యూఏవీలను (డ్రోన్లను) ప్రయోగించే వీలుంది' అని ఐడీఎఫ్ (IDF) యాహలోమ్ కాంబాట్ ఇంజినీరింగ్ యూనిట్ కమాండర్ వివరించారు.


2024లో జరిగిన ఘర్షణల సమయంలోనే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఈ ప్రాంతం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఆ తర్వాత హెజ్‌‌బొల్లా దీనిని పునరుద్ధరించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సొరంగ నెట్‌వర్క్‌లో ఇజ్రాయెల్ సైన్యం పూర్తిస్థాయి దర్యాప్తును ముగించింది. తనిఖీలు పూర్తయిన తర్వాత ఈ భూగర్భ కాంప్లెక్స్‌ను పూర్తిగా పేల్చివేయనున్నట్లు ఆర్మీ ప్రకటించింది.


ఈ వార్తలనూ చదవండి:

మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. నాలుగు విమానాశ్రయాల మూసివేత..

సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. యుద్ధానికి సిద్ధమంటున్న పాకిస్థాన్ రక్షణ మంత్రి..

Updated Date - Jun 22 , 2026 | 05:05 PM