మళ్లీ మంటలు!
ABN , Publish Date - Jul 09 , 2026 | 06:12 AM
పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. యుద్ధం నిలిపివేత వ్యవహారం ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. తమ అనుమతి లేకుండా...
పరస్పరం భారీ దాడులకు దిగిన అమెరికా, ఇరాన్
ఇరాన్‌లోని 80కిపైగా క్షిపణి, డ్రోన్ స్థావరాలు, రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడ్డ అమెరికా
ప్రతిగా గల్ఫ్‌లోని 85 అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడిచేసిన ఇరాన్
నిలిచిన చమురు నౌకల రాకపోకలు
బెదిరింపుల శకం ముగిసిపోయింది
హోర్ముజ్‌లో ఎవరి జోక్యాన్నీ సహించం: ఇరాన్
ఖమేనీ అంత్యక్రియల వేళ ఉద్రిక్త పరిణామాలు
కాల్పుల విరమణ ముగిసినట్టే!
ఇరాన్ పాలకులు మూర్ఖులు.. చర్చలు వృథా
మళ్లీ భారీ స్థాయిలో దాడులు చేస్తాం
ఖార్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటాం
ఇరాన్ చమురు విక్రయ లైసెన్సు రద్దు
ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరగొచ్చు
కానీ సానుకూల ఫలితం అనుమానమే: ట్రంప్
వాషింగ్టన్/టెహ్రాన్/న్యూఢిల్లీ, జూలై 8: పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. యుద్ధం నిలిపివేత వ్యవహారం ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ దాటుతున్నాయంటూ వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో యుద్ధం మళ్లీ మొదలైంది. నౌకలపై దాడులకు ప్రతిగా ఇరాన్‌లోని కీలక రక్షణ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయగా... దానికి దీటుగా స్పందిస్తూ కువైట్, బహ్రెయిన్ సహా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్‌తో యుద్ధం నిలిపివేతకు సంబంధించిన అవగాహన ఒప్పందం ముగిసిపోయినట్టేనని.. ఇరాన్‌తో చర్చలతో సమయం వృధా తప్ప లాభమేమీ లేదని ప్రకటించారు. ఇరాన్‌పై తిరిగి భారీ స్థాయిలో దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఇరాన్ చమురును విక్రయించుకునేందుకు ఇచ్చిన లైసెన్సును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళన మొదలైంది. దాడుల భయంతో హోర్ముజ్ మీదుగా చమురు నౌకల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ముడి చమురుకు మళ్లీ రెక్కలు వచ్చాయి. మన రూపాయి కూడా పతనమైంది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ మంగళవారం సాయంత్రం పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. దీనిపై మండిపడ్డ అమెరికా బుధవారం తెల్లవారుజామున హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ రేవు పట్టణాలు బందర్ అబ్బాస్, సిరిక్‌తోపాటు బందర్ మషెహర్, బుషెహర్, ఖేష్మ్ దీవి తదితర ప్రాంతాల్లో కలిపి 80కిపైగా స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. డ్రోన్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, లాంఛర్లు, నిఘా, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని తెలిపింది. ఏప్రిల్‌లో కాల్పుల విరమణ మొదలైన తర్వాత ఇవే తీవ్రస్థాయి దాడులలని పేర్కొంది. దీనికి ప్రతిగా బహ్రెయిన్‌లోని యూఎస్ ఫిఫ్త్ ఫ్లీట్, కువైట్‌లోని అలీసలేమ్ ఎయిర్‌బేస్ సహా 85 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. బుషెహర్‌లో అమెరికా అత్యాధునిక డ్రోన్ ఎంక్యూ-9ను కూల్చివేసినట్టు ఐఆర్‌జీసీ ప్రకటించింది.

పశ్చిమాసియా సముద్ర జలాల్లో అమెరికా యుద్ధ నౌకలు అంటూ ఆ దేశ సెంట్రల్ కమాండ్ బుధవారం విడుదల చేసిన వీడియోలోని దృశ్యం
గట్టిగా బదులిస్తాం: ఘలీబఫ్
అమెరికా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, మరిన్ని దాడులు చేస్తామంటూ నిరంతరం బెదిరిస్తోందని.. దీనివల్ల అమెరికా సాధించేది ఏమీ ఉండబోదని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘర్ ఘలీబఫ్ స్పష్టం చేశారు. బెదిరింపులు, బలవంతపు ఒత్తిళ్ల శకం ముగిసిపోయిందని.. అమెరికా దాడులకు దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. హోర్ముజ్ విషయంలో ఏ దేశం జోక్యాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. హోర్ముజ్‌లో చమురు, వాణిజ్య నౌకలన్నీ కూడా తాము సూచించిన మార్గంలో, తగిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ప్రయాణించాల్సిందేనని పేర్కొంది. పరస్పర దాడులు ఆపాలని, అవగాహన ఒప్పందానికి కట్టుబడాలని అమెరికా, ఇరాన్‌లకు ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ తదితర దేశాలు విజ్ఞప్తి చేశాయి. ఇదిలా ఉండగా, ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుతోంది. వివిధ దేశాల ప్రతినిధులు, ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. గురువారం సాయంత్రం ఈ కార్యక్రమం ముగియనుంది. అయితే ఖమేనీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను చంపాలంటూ అంత్యక్రియల కార్యక్రమం వేదికగా నినాదాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇరాన్‌తో ఒప్పందం ముగిసినట్టే!: ట్రంప్
ఇరాన్, అమెరికా మధ్య దాడుల నేపథ్యంలో.. ఇక ఇరాన్‌తో యుద్ధం నిలిపివేతకు సంబంధించిన మధ్యంతర అవగాహన ఒప్పందం ముగిసిపోయినట్టేనని ట్రంప్ ప్రకటించారు. టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో సదస్సు సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అంత్యక్రియలు చేసుకోండి అని మేం చెబితే.. వాళ్లు వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. అందుకే మేం దాడి చేశాం. ఇరాన్ పునర్నిర్మించుకుంటున్న రాడార్లు, రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశాం. నాకు సంబంధించినంత వరకు కాల్పుల విరమణ ముగిసిపోయినట్టే. ఇకపై వారితో చర్చలు జరపడం సమయాన్ని వృధా చేయడమే. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, విద్యుత్ వ్యవస్థల తయారీ యూనిట్లు, డీశాలినేషన్ ప్లాంట్లను కూడా ధ్వంసం చేస్తాం. హోర్ముజ్ అవతల మళ్లీ నౌకా దిగ్బంధాన్ని అమలు చేస్తాం’’ అని ట్రంప్ హెచ్చరించారు. అయితే అమెరికా ప్రతినిధులు చర్చలపై ముందుకు వెళ్లవచ్చని, కానీ దానివల్ల ప్రయోజనం ఉంటుందన్నది అనుమానమేనని వ్యాఖ్యానించారు. కాగా, సిరియాను ఉగ్రవాద దేశాల జాబితా నుంచి తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్