అమెరికా భీకర దాడులు చేసినా.. చెక్కుచెదరని ఇరాన్ రహస్య క్షిపణి నగరాలు..
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:06 PM
అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేసినప్పటికీ ఇరాన్ నిర్మించుకున్న భూగర్భ క్షిపణి స్థావరాలు చెక్కుచెదరకుండానే ఉన్నాయట.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేసినప్పటికీ ఇరాన్ నిర్మించుకున్న భూగర్భ క్షిపణి స్థావరాలు చెక్కుచెదరకుండానే ఉన్నాయట. భారీ గ్రానైట్ పర్వతాల లోపల వందల మీటర్ల లోతులో నిర్మించిన ఈ రహస్య స్థావరాల్లో వేలాది క్షిపణులు, డ్రోన్లు, ప్రయోగ వ్యవస్థలు సురక్షితంగానే ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. శత్రువుల వైమానిక దాడుల నుంచి ఆయుధాలను రక్షించుకునేందుకు ఇరాన్ ఏళ్ల తరబడి ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది (Iran Underground Missile Cities).
ఇరాన్‌లోని యాజ్ద్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ భూగర్భ క్షిపణి స్థావరం సుమారు 500 మీటర్ల లోతులో పర్వతం లోపల నిర్మించినట్లు డైలీ మెయిల్ కథనం పేర్కొంది. అత్యంత దృఢమైన షిర్కూహ్ గ్రానైట్ శిలలను తొలిచి నిర్మించిన ఈ స్థావరాన్ని అత్యంత శక్తిమంతమైన జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులతో కూడా ధ్వంసం చేయడం కష్టమని డైలీ మెయిల్ పేర్కొంది. ఈ స్థావరాలు సాధారణ ఆయుధ గిడ్డంగుల్లా కాకుండా భూగర్భ నగరాలను తలపించేలా నిర్మించినట్లు నివేదిక పేర్కొంది. లోపల పొడవైన సొరంగాలు, క్షిపణుల నిల్వ కేంద్రాలు, వాటిని తరలించే రవాణా వ్యవస్థలు ఉన్నట్లు వివరించింది (Underground Missile Bunkers).
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు యాజ్ద్ ప్రాంతంలోని భూగర్భ క్షిపణి స్థావరంపై కనీసం ఆరుసార్లు దాడులు చేసినట్టు ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ (ఐఎస్‌డబ్ల్యూ) పేర్కొంది. ఇన్నిసార్లు దాడి చేసినప్పటికీ ప్రవేశ మార్గాలు మాత్రమే దెబ్బతిన్నాయి. వాటిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు, ఇతర నిఘా సమాచారం ద్వారా బయటపడింది. కొన్ని ప్రాంతాల్లో దాడుల అనంతరం నిర్మాణ పరికరాలు తిరిగి కనిపించినట్లు నివేదికలు పేర్కొన్నాయి (Iran Missile Bases).
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత కూడా ఇరాన్ వద్ద గణనీయమైన ఆయుధ సంపత్తి మిగిలి ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి (Iran US War). సీఎన్ఎన్‌కు అందిన అంచనాల ప్రకారం.. ఇరాన్ వద్ద దాదాపు సగం క్షిపణి ప్రయోగ వాహనాలు, వేలాది డ్రోన్లు మిగిలి ఉన్నాయి. ఇజ్రాయెల్ గతంలో ఇరాన్ వద్ద సుమారు 470 క్షిపణి ప్రయోగ వాహనాలు ఉన్నట్లు అంచనా వేసింది. వాటిలో దాదాపు 60 శాతం ధ్వంసమయ్యాయని లేదా పనిచేయకుండా చేశామని ప్రకటించింది. అయితే వాస్తవంగా ఇరాన్ వద్ద ఇంకా ఎన్ని ఆయుధాలు ఉన్నాయనే విషయంలో స్పష్టత లేదు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..