Share News

హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఇరాన్ గాయనికి 74 కొరడా దెబ్బలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:15 PM

ఇరాన్‌కు చెందిన ప్రముఖ గాయని పరస్తూ అహ్మదీ తన సంగీత ప్రదర్శనలో భాగంగా హిజాబ్ లేకుండా పాట పాడారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి న్యాయస్థానం ఆమెకు 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది

హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఇరాన్ గాయనికి 74 కొరడా దెబ్బలు
గాయని పరస్తూ అహ్మదీ

ఇంటర్నెట్ డెస్క్: హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఓ గాయనికి ఇరాన్ న్యాయస్థానం 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది. ఈ తీర్పుతో మహిళల హక్కులపై ఆ దేశంలో మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరస్తూ అహ్మదీ(29) గాయనిగా ఇరాన్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. సంగీత ప్రదర్శన కోసం ఆమె 2024 డిసెంబర్‌లో ఖోమ్ నగరానికి చేరుకున్నారు. అక్కడ నలుగురు గాయకులతో కలిసి హిజాబ్ లేకుండా పాటలు పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. లక్షల కొద్దీ లైకులు వచ్చాయి. అయితే హిజాబ్ లేకుండా అహ్మదీ పాట పాడడాన్ని అక్కడి న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి కేసు నమోదు చేసింది.


విచారణ జరిపిన అనంతరం పరస్తూ అహ్మదీతో పాటు ఆమె బృందంలో ఒక్కొక్కరికి 74 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. అలాగే రెండేళ్లపాటు విదేశీ ప్రయాణాలు, సంగీత ప్రదర్శనలపైనా నిషేధం విధించింది. నిన్న (సోమవారం) ఈ కొరడా దెబ్బల శిక్ష అమలైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్త్రీల స్వేచ్ఛ, వస్త్రధారణపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. ఇరాన్‌లో మహిళలు అణచివేతకు గురవుతున్నారని కొందరు వాపోతున్నారు. ఈ ఘటన తరువాత ఆ దేశంలో పలు నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై మానవ హక్కుల సంస్థలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం జరిగిన అమినీ మరణ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. మహిళల హక్కులను ఆ దేశం అణచివేస్తోందని పేర్కొంటున్నాయి. 2022లో అమినీ(22) అనే యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న కారణంతో ఇరాన్‌లో అరెస్ట్ అయ్యారు. తరువాత ఆమె పోలీస్ కస్టడీలోనే మరణించారు. అప్పట్లో దీనిపై ఎన్నో ఆందోళనలు జరిగాయి.


ఈ వార్తలూ చదవండి

అమెరికాలో వలసదారులకు గ్రీన్ కార్డు అవకాశం? డెమోక్రాట్ల కొత్త బిల్లు..

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు? రష్యా ప్లాన్స్‌పై జర్మనీ ఆందోళన...

Updated Date - Nov 24 , 2026 | 04:34 PM