హోర్ముజ్‌పై కఠిన ఆంక్షలు.. కొత్త చట్టం తెచ్చిన ఇరాన్ పార్లమెంట్
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:14 PM
హోర్ముజ్ జలసంధిలో తమ నిబంధనలను ఉల్లంఘించే నౌకలపై కొరడా ఝులిపించింది ఇరాన్. సరుకును జప్తు చేయడంతో పాటు, వాటిని తాత్కాలికంగా అదుపులోకి తీసుకునే ప్రతిపాదిత బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
టెహ్రాన్, సెప్టెంబర్ 23: పశ్చిమాసియాలో అమెరికాతో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన వేళ, అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ప్రయాణించే విదేశీ నౌకలకు సంబంధించి ఇరాన్ పార్లమెంటరీ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ నిబంధనలను ఉల్లంఘించే నౌకల సరుకును జప్తు చేయడంతో పాటు వాటిని తాత్కాలికంగా అదుపులోకి తీసుకునే నిబంధనలతో కూడిన ప్రతిపాదిత బిల్లుకు 'నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిటీ' ఆమోదం తెలిపింది.
కొత్త చట్టంలోని ప్రధానాంశాలు
సరుకు జప్తు, నౌకల నిలిపివేత (ఆర్టికల్ 13)
హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లేటప్పుడు ఇరాన్ నిబంధనలు పాటించని నౌకలలోని 20 శాతం సరుకును జప్తు చేయవచ్చు లేదా దానికి సమానమైన జరిమానా విధించవచ్చు. జరిమానాలు చెల్లించే వరకు ఆ నౌకలను ఇరాన్ నావికాదళాలు స్వాధీనం చేసుకుని నిలిపివేసే అధికారం లభిస్తుంది.
ప్రత్యేక సముద్ర సంబంధిత కోర్టులు
ఈ ఉల్లంఘనలపై విచారణకు అంతర్జాతీయ సముద్ర చట్టాలపై పట్టున్న న్యాయమూర్తులతో ప్రత్యేక కోర్టు బెంచ్‌లను ఇరాన్ న్యాయశాఖ ఏర్పాటు చేస్తుంది.
సైన్యానికి పూర్తి పర్యవేక్షణ (ఆర్టికల్ 14 & 15)అధికారం
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ చట్టపరమైన సార్వభౌమత్వాన్ని ఈ బిల్లు పునరుద్ఘాటిస్తుంది. ఈ నిబంధనల అమలు బాధ్యతను ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్‌కు అప్పగించారు. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకొకసారి పార్లమెంటరీ కమిటీకి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
ఐరాసలో ట్రంప్ హెచ్చరికలు.. ఇరాన్ వాకౌట్
మరోవైపు ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు నౌకలకు యుఎస్ నావికాదళం రక్షణగా వెళ్తోందని, ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఓడలను సురక్షితంగా దాటిస్తున్నామని తెలిపారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోతే ఆ దేశాన్ని సులువుగా.. సమూలంగా నాశనం చేయగలనని, అయితే అమెరికా ఎన్నికల తర్వాత ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
ట్రంప్ ప్రసంగం ప్రారంభం కాగానే ఐరాస సమావేశంలో ఉన్న ఇరాన్ ప్రతినిధి బృందం నిరసనగా సభ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంతో హోర్ముజ్ మార్గంలో ఇరాన్ తీసుకుంటున్న కొత్త చర్యలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు