మొజ్తబా ఖమేనీ సజీవంగానే ఉన్నారా? తాజా లేఖతో కొత్త అనుమానాలు!
ABN , Publish Date - Mar 30 , 2026 | 06:57 AM
ఇరాన్ ప్రభుత్వ మీడియా సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పేరుతో ఒక వ్రాతపూర్వక సందేశాన్ని విడుదల చేసింది. సదరు సందేశంలో ఇరాన్‌కు మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు, అక్కడి మత పెద్దలకు మొజ్తబా కృతజ్ఞతలు చెప్పినట్టుంది. అయితే, మొజ్తబా మాట్లాడిన వీడియో లేదా, ఆడియో బయటకు రాలేదు.
టెహ్రాన్, మార్చి 30: పశ్చిమాసియా యుద్ధం 30వ రోజుకు చేరుకున్న తరుణంలో, ఇరాన్ అగ్రనేత మొజ్తబా ఖమేనీ చుట్టూ ఉన్న రహస్యం మరింత ముదిరింది. గత కొన్ని రోజులుగా ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో.. ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ, మొజ్తబా ఖమేనీ పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేశారు. 'ఆయన బహుశా మరణించి ఉండవచ్చు లేదా చాలా దారుణమైన స్థితిలో ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఎవరూ ఆయన్ను చూడలేదు, ఆయన నుంచి ఎలాంటి మాటలు రావడం లేదు,' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇరాన్ నాయకత్వం పూర్తిగా ఛిన్నాభిన్నమైందని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ నుంచి వచ్చిన తాజా సందేశం
అయితే, ట్రంప్ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలో.. ఇరాన్ ప్రభుత్వ మీడియా తాజాగా మొజ్తబా ఖమేనీ పేరుతో ఒక వ్రాతపూర్వక సందేశాన్ని విడుదల చేసింది. అందులో మొజ్తబా.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి ఇరాన్‌కు మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు, అక్కడి మత పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే, ఈ సందేశం కేవలం వ్రాతపూర్వకంగా మాత్రమే ఉంది. ఆయన మాట్లాడిన వీడియో కానీ, ఆడియో కానీ బయటకు రాలేదు. దీంతో ఆయన నిజంగా క్షేమంగా ఉన్నారా లేక తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారా అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్... డీఎంకే మేనిఫెస్టో
వాళ్లు వచ్చారో మీరు మాంసం కూడా తినలేరు: మమతా బెనర్జీ