పర్షియన్ గల్ఫ్ రణరంగం
ABN , Publish Date - Jul 14 , 2026 | 06:15 AM
పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణ మరింత ముదురుతోంది. సోమవారం కూడా ఇరుదేశాలు పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. ఖతార్, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లలోని...
ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు
వీడియోలు విడుదల చేసిన ఐఆర్‌జీసీ
హోర్ముజ్‌ను ఆక్రమిస్తామని ట్రంప్ ప్రకటన
దుబాయ్, జూలై 13: పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణ మరింత ముదురుతోంది. సోమవారం కూడా ఇరుదేశాలు పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. ఖతార్, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. ఒమన్‌పై కూడా దాడి చేసింది. కువైట్‌లోని రెండు ఎయిర్‌బే్‌సలతోపాటు బహ్రెయిన్‌లోని షేక్ ఈసా ఎయిర్‌బే్‌సలో ఉన్న చమురు ట్యాంకులు, పేట్రియాట్ గగన రక్షణ వ్యవస్థలు, వ్యూహాత్మక రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) సోమవారం ప్రకటించింది. జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్‌బే్‌సలోని ఆయిల్ డిపోలు, ఆయుధ నిల్వ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఒక ఎయిర్‌బే్‌సలో తగలబడిపోతున్న చమురు కేంద్రం వీడియోను విడుదల చేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా డ్రోన్ ఫ్లీట్‌ను ధ్వంసం చేసినట్లు ఇరాన్ మీడియా సంస్థ ఇర్నా తెలిపింది. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న అమెరికా ఆరోపణలను ఇరాన్ తిరస్కరించింది. అమెరికానే పదేపదే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ ఆరోపించారు. ‘వాళ్లు ఒప్పందాన్ని గౌరవిస్తే మేము గౌరవిస్తాం.. వాళ్లు దాడులు చేస్తే మేమూ దాడులు చేస్తాం’ అని స్పష్టంచేశారు.
హోర్ముజ్‌ను ఆధీనంలోకి తీసుకుంటాం
ఇరాన్‌లోని మిలిటరీ స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ కూడా సోమవారం ప్రకటించింది. దాదాపు 140 టార్గెట్లపై క్షిపణి దాడులు చేసి ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఆదివారం హోర్ముజ్ జలసంధిలో ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేయటంతో తాము స్పందించినట్లు వెల్లడించింది. ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టులో రిపేర్ల కోసం ఉంచిన సబ్‌మెరైన్‌పై సముద్ర డ్రోన్‌తో దాడిచేసి పేల్చివేసినట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. తమ నౌకాదళం ఇలాంటి డ్రోన్ దాడి చేయటం ఇదే తొలిసారి అని పేర్కొంది. మరోవైపు హోర్ముజ్ జలసంధిని ఆక్రమిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వాణిజ్య నౌకా రవాణాకు ఆటంకం కలగకుండా చూసేందుకు ఆ మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని రక్ష కుడిగా ఉంటామని ఫాక్స్‌న్యూ్‌సకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. నౌకలకు రక్షణ కల్పించేందుకుగాను ఆ నౌకల్లో ఉండే సరుకు విలువలో 20 శాతాన్ని ఫీజుగా వసూలు చేస్తామని చెప్పారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఇరాన్ తీరాన్ని మొత్తం మళ్లీ దిగ్బంధిస్తున్నామని, ఆ దేశ నౌకలను పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు రానివ్వబోమని స్పష్టంచేశారు. ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ పని 90 శాతం అయిపోయిందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘ఖమేనీ మిలిటరీ మొత్తం పోయింది. శక్తిమంతమైన నాయకులంతా పోయారు. మొజ్తబా పని 90 శాతం అయిపోయింది’ అని పేర్కొన్నారు. అమెరికా దాడిలో తీవ్రంగా గాయపడి అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఆరోగ్యపరంగా చావు అంచుల్లో ఉన్నారన్నది ట్రంప్ అభిప్రాయం అన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఆ 13 మందిని లేపేస్తాం..
తన తండ్రి, దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించిన నేపథ్యంలో తమ హిట్‌లిస్టులో 13 మంది అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ ప్రముఖులు ఉన్నారంటూ.. ఇరాన్ మీడియా సంస్థ హమ్‌షహరీ వారి పేర్లను కూడా ప్రకటించింది. అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, విదేశాంగ మంత్రి గిడియాన్ సార్, మిలిటరీ అధికారి ఇయాల్ జమీర్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ తదితరుల పేర్లు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News