Share News

ఇరాన్‌ కకావికలం

ABN , Publish Date - Mar 02 , 2026 | 03:04 AM

ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చడమే లక్ష్యమంటూ దాడులకు దిగిన అమెరికా, ఇజ్రాయెల్‌.. తొలిదాడినే అత్యంత కచ్చితత్వంతో పూర్తిచేశాయి. టెహ్రాన్‌లోని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ ప్రధాన కార్యాలయంపై........

ఇరాన్‌ కకావికలం

  • రక్షణ, ఐఆర్‌జీసీ, ఎయిర్‌ఫోర్స్‌, ఇంటెలిజెన్స్‌ కార్యాలయాల ధ్వంసం

  • 9 ఇరాన్‌ యుద్ధనౌకలు, నేవీ హెడ్‌క్వార్టర్‌పై దాడి

  • టెహ్రాన్‌ సహా ఇరాన్‌ నగరాలపై ఇజ్రాయెల్‌ బాంబులు

  • రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్‌ చీఫ్‌ మృతి

  • వందల సంఖ్యలో సైనికులు, భద్రతా సిబ్బంది కూడా..

  • పాఠశాలపై క్షిపణి దాడిలో 165కు చేరిన మృతులు

  • ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాల్లోని 27 అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్‌

  • ఇజ్రాయెల్‌లో 9 మంది.. గల్ఫ్‌ దేశాల్లో ఆరుగురి మృతి

  • ముగ్గురు అమెరికా సైనికులూ.. ఐదుగురు విషమం

  • టెహ్రాన్‌, ఇతర నగరాల్లో ఖమేనీకి వేలాది మంది నివాళి

  • 40 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఇరాన్‌

  • ఇంకా వేలాది లక్ష్యాలపై దాడులు చేస్తాం: నెతన్యాహు

  • హోర్ముజ్‌ జలసంధిలో 3 చమురు నౌకలపై క్షిపణులు

  • ఒక నౌకలో 15 మంది భారతీయులు.. క్షేమం

దుబాయ్‌/వాషింగ్టన్‌/టెల్‌అవీవ్‌, మార్చి 1: ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చడమే లక్ష్యమంటూ దాడులకు దిగిన అమెరికా, ఇజ్రాయెల్‌.. తొలిదాడినే అత్యంత కచ్చితత్వంతో పూర్తిచేశాయి. టెహ్రాన్‌లోని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ ప్రధాన కార్యాలయంపై 30కిపైగా బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో అయతుల్లా ఖమేనీ (86) మరణించారు. ఆయనతోపాటు ఇరాన్‌ రక్షణ మంత్రి అమీర్‌ నసీర్‌జాదే, ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ) కమాండర్‌ మహమ్మద్‌ పాక్‌పౌర్‌, ఖమేనీ ప్రధాన సలహాదారు అలీ షంఖనీ, మరో నలుగురు మిలటరీ ఉన్నతాధికారులు, ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవడు కూడా శనివారం ఉదయం జరిగిన తొలి దాడుల్లోనే మృతిచెందారు.


కానీ ఆదివారం ఉదయం వరకు వివరాలు బయటికి రాలేదు. ఖమేనీ మృతిని నిర్ధారించుకున్న తర్వాత ఆదివారం ఉదయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. తర్వాత కాసేపటికి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అమరుడయ్యారని ఆ దేశ అధికారిక టీవీ చానల్‌ ‘ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ (ఐఆర్‌ఐబీ)’ వెల్లడించింది. ఖమేనీ తన కార్యాలయంలో ఉండగా జరిగిన దాడిలో మరణించారని, ఆయన నిరంతరం ప్రజల కోసం ముందు నిలిచి, తన బాధ్యతలను నిర్వర్తించారన్న విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందని పేర్కొంది. ఇక ఖమేనీ మృతి పట్ల ఇరాన్‌ 40రోజుల పాటు సంతాపదినాలను, ఏడు రోజుల పాటు పూర్తిస్థాయి సెలవులను ప్రకటించింది. ఇరాన్‌ ప్రజలు అత్యంత పవిత్రమైనదిగా భావించే ఖోమ్‌ నగరంలోని జమ్‌కారన్‌ మసీదుపై ఎర్రజెండా ఎగురవేశారు. ఖమేనీని చంపడంపై ఆయన మద్దతుదారుల్లో ఉన్న ఆగ్రహానికి, ప్రతీకారం తీర్చుకోవాలన్న కసికి ఇది నిదర్శనమని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌ తమ రెడ్‌లైన్‌ దాటాయని, ఆ దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ హెచ్చరించింది. ఈ క్రమంలో గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్‌, అమెరికా కూడా ఇరాన్‌లోని టెహ్రాన్‌, ఇతర కీలక ప్రాంతాల్లో వైమానిక, క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి.

అటు నివాళి.. ఇటు సంబరాలు!

ఖమేనీ మృతి చెందారన్న విషయం తెలిసి టెహ్రాన్‌తోపాటు ఇరాన్‌లోని కీలక పట్టణాల్లో వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. పలుచోట్ల ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఖమేనీకి నివాళి అర్పిస్తున్న దృశ్యాలను ఇరాన్‌ అధికారిక టీవీ ప్రసారం చేసింది. టెహ్రాన్‌లోని ఎంఘెలాబ్‌ స్క్వేర్‌ ప్రాంతంలో వేలాది మంది నలుపు వస్త్రాలు ధరించి, ఇరాన్‌ జెండాలు ఊపుతూ ఖమేనీకి నివాళి అర్పించారు. మరోవైపు ఖమేనీ మృతితో టెహ్రాన్‌, ఇస్ఫహాన్‌, ఇతర నగరాల్లో కొన్నిచోట్ల జనం సంబరాలు చేసుకుంటున్నట్టుగా రాయిటర్స్‌, ఇతర వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇక ఇరాన్‌పై దాడి, ఖమేనీ మృతి పట్ల ఇరాక్‌, పాకిస్థాన్‌తోపాటు పలు దేశాల్లో ఆందోళనలు జరిగాయి. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి నిరసనకారులు ప్రయత్నించారు. పాకిస్థాన్‌లోని కరాచీలో అమెరికా ఎంబసీకి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పది మంది మరణించారు.

3.jpg4.jpg


లింకన్‌ నౌకపై దాడి చేశాం.. అదేమీ లేదు..

యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ విమాన వాహక యుద్ధ నౌకపై నాలుగు బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేశామని, నౌక కొంతమేర ధ్వంసమైందని ఐఆర్‌జీసీ ఆదివారం ప్రకటించింది. అయితే అలాంటిదేమీ లేదని, ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు కనీసం నౌక దరిదాపుల్లోకి కూడా రాలేదని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ పేర్కొంది. అంతేకాదు చబహార్‌ పోర్టులో ఇరాన్‌కు చెందిన జమరాన్‌ క్లాస్‌ యుద్ధ నౌకపై తమ దళాలు దాడి చేశాయని, అది సముద్రంలో మునిగిపోతోందని పేర్కొంది. కాగా, హోర్ముజ్‌ జల సంధి మీదుగా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌ నౌకపై క్షిపణి దాడి జరిగింది. పలావ్‌ దేశ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 15 మంది భారతీయులు సహా 20 మంది సిబ్బంది ఉన్నారని, అందులో నలుగురికి గాయాలయ్యాయని ఒమన్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. హోర్ముజ్‌ జలసంధిని మూసేస్తున్నట్టు ఐఆర్‌జీసీ నుంచి అనధికారికంగా హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో.. చమురు నౌకలపై దాడులు జరగడం గమనార్హం. దీనితో వందల కొద్దీ చమురు రవాణా నౌకలు హోర్మజ్‌ జల సంధికి ఇరువైపులా నిలిచిపోయాయి.

శత్రువులకు నరకానికి గేట్లు తెరుస్తాం: ఇరాన్‌

ఖమేనీ మరణానికి కారకులైన వారికి అత్యంత తీవ్రమైన శిక్ష తప్పదని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ), ఇరాన్‌ కేబినెట్‌ తీవ్రంగా హెచ్చరించాయి. తమ చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో అమెరికా స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై ఆపరేషన్‌ చేపడతామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. తమ ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. శత్రువుల కోసం నరకలోకం గేట్లు తెరిచే ఉంచుతామని వ్యాఖ్యానించింది.ఖమేనీ మృతి నేపథ్యంలో తాత్కాలిక పాలనా మండలిని ఏర్పాటు చేశామని.. శత్రుదేశాల దాడులను దీటుగా ఎదుర్కొని, వారి స్థావరాలను నాశనం చేస్తామని ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ పేర్కొన్నారు.

8.jpg6.jpg


పవిత్ర రంజాన్‌లో రణరంగం

  • అరబ్‌ దేశాల్లో ముస్లింలపై తీవ్ర ప్రభావం

రంజాన్‌ మాసంలో ప్రపంచంలో ఏ మూలన ఉన్న ముస్లింలు అయినా ఎంతో భక్తిశ్రద్ధలతో గడుపుతారు. సాధారణంగా రోజుకు ఐదుసార్లు నమాజు చేసే ముస్లింలు.. రంజాన్‌ మాసంలో అంతకంటే ఎక్కువసార్లు చేస్తూ దైవ చింతనలో ప్రశాంతంగా గడుపుతుంటారు. ఇలాంటి సమయంలో యుద్ధం మొదలుకావటంతో అరబ్‌ దేశాల్లోని ముస్లింలలో అసహనం పెరిగిపోతోంది. నమాజు చేయటానికి కూడా ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎప్పుడు బాంబులు వచ్చిపడతాయో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పలు ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఉండేవారిపై ఆంక్షలు అధికంగా ఉన్నాయి. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుభికుతున్నాయి.

5.jpg1.jpg


పరస్పరం భీకర దాడులు..

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌తోపాటు ఇస్ఫహాన్‌, ఇతర కీలక నగరాల్లోని మిలటరీ స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలపై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం టెహ్రాన్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయం సమీపంలో అతిభారీ పేలుడు జరిగింది. మెహ్రన్‌ నగరంలో జరిగిన క్షిపణి దాడిలో 43 మంది ఇరాన్‌ భద్రతా సిబ్బంది మరణించారు. ఇరాన్‌లోని బాలికల పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో మృతుల సంఖ్య 165కు పెరిగింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై, గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ నిరంతరంగా క్షిపణుల దాడి కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు దుబాయ్‌, ఖతార్‌, బహ్రెయిన్‌, సౌదీ, ఇరాక్‌, కువైట్‌ తదితర దేశాల్లోని 27 అమెరికా సైనిక స్థావరాలపై ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌’ పేరిట దాడులు చేపట్టినట్టు ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది. కువైట్‌లోని అమెరికా నౌకాదళ బేస్‌పై నాలుగు క్షిపణులు, 12 డ్రోన్లతో దాడి చేసి ధ్వంసం చేశామని.. పెద్ద సంఖ్యలో అమెరికా సైనికులు మరణించారని తెలిపింది. ఇక ఇరాన్‌ అధికారిక టీవీ ఐఆర్‌ఐబీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులు చేసింది. అయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రసారాలు కొనసాగిస్తున్నట్టు ఐఆర్‌ఐబీ ప్రకటించింది. కాగా, ఇరాన్‌ దాడులతో ఇజ్రాయెల్‌లో 9 మంది మృతిచెందగా, 121 మంది గాయపడినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇక ఇరాక్‌లో ఇద్దరు, కువైట్‌లో ఒకరు, యూఏఈలో ముగ్గురు మృతిచెందారు. ఇక ముగ్గురు అమెరికన్‌ సైనికులు మరణించారని, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. ఇరాన్‌లోని కీలక క్షిపణి స్థావరాలపై బీ-2 స్టెల్త్‌ బాంబర్లతో దాడులు చేశామని, ఒక్కోటీ 907 కిలోల బరువైన భారీ బాంబులతో విధ్వంసం సృష్టించామని వెల్లడించింది.

ఇంకా వేలాది లక్ష్యాలపై దాడులు కొనసాగుతాయి: నెతన్యాహు

ఇరాన్‌ ఉన్నతాధికారుల్లో చాలా మంది చనిపోయారని, ఈ దాడులు మరికొన్ని రోజులపాటు కొనసాగుతాయని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. ఇంకా వేలాది లక్ష్యాలపై దాడులు చేయనున్నట్టు తెలిపారు. ఇరాన్‌కు చెందిన ధైర్యవంతులైన ప్రజలు తమ సంకెళ్లను తెంచుకుని, స్వేచ్ఛను పొందేందుకు అనువైన పరిస్థితిని తాము సృష్టిస్తున్నామని.. అంతా బయటికి వచ్చి ప్రభుత్వాన్ని కూలదోసి స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా ఇజ్రాయెల్‌ తమ సైన్యాన్ని పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధం చేస్తోంది. లక్ష మంది రిజర్వు బలగాల సిబ్బందిని వెంటనే విధుల్లోకి రావాల్సిందిగా ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.

7.jpg2.jpg

Updated Date - Mar 02 , 2026 | 03:08 AM