Share News

అసలైన యుద్ధం ముందుంది!

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:17 AM

ఇరాన్‌పై తాము ఇంకా పూర్తిస్థాయిలో దాడులు చేపట్టలేదని, యుద్ధం ఇప్పుడే మొదలైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు....

అసలైన యుద్ధం ముందుంది!

  • మా వద్ద భారీగా ఆయుధాలున్నాయి.. వాటితో ఎన్నాళ్లయినా యుద్ధం చేయొచ్చు

  • ఇరాన్‌ నాయకత్వంతోపాటు వైమానిక, నౌకా దళాలు తుడిచిపెట్టుకుపోయాయి

  • ఇరాన్‌ చర్చలు కోరుతోంది.. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పా: ట్రంప్‌

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా భీకర దాడులు.. ఇరాన్‌ కొత్త రక్షణ మంత్రీ మృతి!

  • టెహ్రాన్‌, బుషెహర్‌ ఎయిర్‌పోర్టుల్లో విధ్వంసం.. ఒక ప్రయాణికుల విమానం ధ్వంసం

  • ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం.. టెల్‌అవీవ్‌, సెంట్రల్‌ ఇజ్రాయెల్‌లో విధ్వంసం

  • 12కు చేరిన మృతులు.. సౌదీలోని అమెరికా ఎంబసీపై డ్రోన్‌ దాడులు

  • గల్ఫ్‌ దేశాల్లోని ఎంబసీలను మూసివేస్తున్నఅమెరికా.. స్వదేశానికి సిబ్బంది తరలింపు

  • ఇరాన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు మద్దతిస్తాం: చైనా విదేశాంగ మంత్రి

  • దగ్గర్లోనే భారీ శబ్దం!.. చాలా భయపడ్డా.. క్షేమంగా తిరిగివచ్చా: పీవీ సింధు

దుబాయ్‌/వాషింగ్టన్‌, మార్చి 3: ఇరాన్‌పై తాము ఇంకా పూర్తిస్థాయిలో దాడులు చేపట్టలేదని, యుద్ధం ఇప్పుడే మొదలైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అసలైన దాడి ముందుందని చెప్పారు. తమ వద్ద అపరిమితంగా ఆయుధాలు పోగుపడి ఉన్నాయని, అవి ఇతర దేశాల కంటే మెరుగైనవని చెప్పారు. వాటితో ఎంతకాలమైనా విజయవంతంగా యుద్ధం చేయవచ్చని వ్యాఖ్యానించారు. తమపై దాడికి ఇరాన్‌ సిద్ధమైందని, దాంతో తామే ముందుగా దాడికి దిగామని పేర్కొన్నారు. సీఎన్‌ఎన్‌ ఇంటర్వూలో, తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో ట్రంప్‌ ఈ అంశంపై మాట్లాడారు. అమెరికా వద్ద మధ్యస్థాయి, ఎగువ మధ్య స్థాయి ఆయుధాలు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అత్యాధునిక, అత్యున్నత ఆయుధాలు సరిపడా ఉన్నా, తాము కావాలనుకున్న స్థాయికి చేరలేదన్నారు. గత అధ్యక్షుడు జోబిడెన్‌ వందల బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఇచ్చారని.. కానీ వాటి నిల్వలను పునరుద్ధరించలేదని విమర్శించారు. తాను అధ్యక్ష పదవి చేపట్టాక తిరిగి ఆయుధాల నిల్వలను పెంచానని, మిలటరీని బలోపేతం చేశానని పేర్కొన్నారు. అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దింపి ఇరాన్‌పై భూతల దాడులు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని, కానీ ఆ అవసరం రాకపోవచ్చని వ్యాఖ్యానించారు. అయితే అరబ్‌ గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు అనూహ్య పరిణామమని, తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. చర్చలు జరుపుదామని ఇరాన్‌ కోరుతోందని.. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని స్పష్టం చేశానని ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌ నాయకత్వం, వారి గగనతల రక్షణ, వైమానిక, నావికా దళాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయని పేర్కొన్నారు.

3.jpg


ఇరాన్‌పై భీకర స్థాయిలో దాడులు

సోమవారం అర్ధరాత్రి తర్వాత ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్‌ విరుచుకుపడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం, సాయంత్రం కూడా యుద్ధ విమానాలతో దాడులు చేశాయి. రాజధాని టెహ్రాన్‌లో వరుసగా పేలుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఎంఘెలాబ్‌ స్క్వేర్‌ ప్రాంతంలోని ప్రభుత్వ భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఆ భవనాలకు సమీపంలోని సాధారణ ప్రజల నివాసాలు కూడా ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా తెలిపింది. ఇక్కడి ప్రపంచ వారసత్వ కట్టడమైన ప్రముఖ గొలెస్తాన్‌ ప్యాలెస్‌ పూర్తిగా దెబ్బతిన్నది. ఇక ఇరాన్‌లోని కెర్మన్‌ ఎయిర్‌బేస్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో దాడిచేసి ధ్వంసం చేసింది. ఈ ఘటనలో 13 మంది ఇరాన్‌ సైనికులు మృతిచెందారు. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ విమానాశ్రయం, బుషెహర్‌ రేవు పట్టణంలోని ఎయిర్‌పోర్టుపై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడి చేశాయి. బుషెహర్‌లో ఒక ప్రయాణికుల విమానం ధ్వంసమైంది. ఆ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అణు విద్యుత్‌ ప్లాంట్‌ ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తంగా యూఎ్‌స-ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతిచెందినవారి సంఖ్య 787కు చేరినట్టు రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ వెల్లడించింది.

ఇరాన్‌ నూతన రక్షణ మంత్రి మృతి!

ఇరాన్‌ నూతన రక్షణ మంత్రి సయ్యద్‌ మాజిద్‌ ఎబ్‌ అల్‌ రెజా తమ వైమానిక దాడుల్లో మరణించారని ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు ప్రసారం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో రక్షణ మంత్రి అమీర్‌ నసీర్‌జాదే మరణించిన నేపథ్యంలో.. మాజిద్‌ అల్‌ రెజా సోమవారమే రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. అయితే మాజిద్‌ అల్‌ రెజా మృతి అంశంపై ఇరాన్‌ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

2.jpg


అరబ్‌ గల్ఫ్‌ దేశాల్లో అమెరికా ఎంబసీలు ఖాళీ..

సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై రెండు ఇరాన్‌ డ్రోన్‌ దాడులు జరిగాయి. పేలుళ్లు జరిగి, మంటలు చెలరేగాయి. దీనితో ఎంబసీని అమెరికా మూసివేసింది. కువైట్‌లోని అమెరికా ఎంబసీపై ఇప్పటికే డ్రోన్‌ దాడి జరగడం, ఇరాన్‌ దాడులను విస్తృతం చేస్తుండటంతో.. సౌదీతోపాటు కువైట్‌, బహ్రెయిన్‌, ఇరాక్‌, ఖతార్‌, జోర్డాన్‌ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేయాలని అమెరికా నిర్ణయించింది. ఎంబసీలలోని అత్యవసరమైన సిబ్బంది మినహా మిగతా అందరినీ ఖాళీ చేయించి అమెరికాకు తరలిస్తోంది. మరోవైపు పశ్చిమాసియా, గల్ఫ్‌ ప్రాంతంలోని దేశాల్లో ఉన్న అమెరికన్లు వెంటనే వెళ్లిపోవాలని సూచించింది.

నతాంజ్‌ అణుకేంద్రం స్వల్పంగా ధ్వంసం

ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల్లో ఇరాన్‌లోని నతాంజ్‌ అణుశుద్ధి కేంద్రం స్వల్పంగా ధ్వంసమైందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) సోమవారం ప్రకటించింది. భూగర్భంలో ప్రధాన కేంద్రానికి వెళ్లే మార్గం, భవనాలు మాత్రమే దెబ్బతిన్నాయని.. ప్రస్తుతం నతాంజ్‌ కేంద్రం ఎటువంటి రేడియోధార్మికత లీక్‌ కావడం లేదని పేర్కొంది.

5.jpg


ఇరాన్‌కు చైనా మద్దతు: చైనా విదేశాంగ మంత్రి

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు చైనా మద్దతు ప్రకటించింది. ఇరాన్‌, చైనా విదేశాంగ మంత్రులు అబ్బాస్‌ అరాగ్చి, వాంగ్‌ యి మంగళవారం ఫోన్‌లో చర్చలు జరిపారు. అనంతరం వాంగ్‌ యి మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌ తన సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రాంతీయ సమగ్రత, చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి చైనా మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇరాన్‌లో మిలిటరీ ఆపరేషన్లను వెంటనే నిలిపేయాలని అమెరికా, ఇజ్రాయెల్‌లకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ‘‘పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉపశమించేలా అధ్యక్షుడు పుతిన్‌ ప్రయత్నిస్తున్నారు. యూఏఈ, ఖతార్‌, బహ్రెయిన్‌, సౌదీ అరేబియా నేతలతో ఫోన్‌లో మాట్లాడారు’’ అని రష్యా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

4.jpg

ఎయిర్‌బేస్‌లు, ఎంబసీలపై ఇరాన్‌ దాడులు

ఇరాన్‌ అటు ఇజ్రాయెల్‌తోపాటు ఇటు అరబ్‌ గల్ఫ్‌ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించింది. మంగళవారం సౌదీ రియాద్‌లోని అమెరికా ఎంబసీపై, ఇరాక్‌లోని ఎర్బిల్‌లో ఉన్న అమెరికా మిలటరీ స్థావరంపై డ్రోన్‌ దాడులు చేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఎయిర్‌బేస్‌ మెయిన్‌ కమాండ్‌ భవనం ధ్వంసమైంది. ఖతార్‌లోని దోహాలో మంగళవారం రాత్రి భారీస్థాయిలో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్‌ దాడులతో ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య 12కు పెరిగింది. సెంట్రల్‌ ఇజ్రాయెల్‌, టెల్‌ అవీవ్‌లో పలుచోట్ల మంగళవారం ఇరాన్‌ క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన అమెరికా సైనికుల సంఖ్య ఆరుకు పెరిగింది.

Updated Date - Mar 04 , 2026 | 05:45 AM