Share News

హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచే ఉంటుంది: ఇరాన్

ABN , Publish Date - Apr 17 , 2026 | 06:54 PM

ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసేవరకూ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచుతున్నట్టు ప్రకటించింది.

హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచే ఉంటుంది: ఇరాన్
Iran External Minister Abbas Araghchi

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ రవాణాకు కీలకంగా మారిన హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పంద కాలం ముగిసేవరకూ హోర్ముజ్‌ పూర్తిగా తెరిచి ఉంటుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు.


ఇరాన్ తాజా ప్రకటనతో.. హోర్ముజ్ జలసంధిలో ఇకపై అన్ని వాణిజ్య నౌకలకు ప్రవేశం ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్య రవాణాకు కీలకమైన ఈ జలమార్గంలో వాణిజ్య నౌకల ప్రయాణాలకు మార్గం సుగమమైంది. ఇరాన్, ఇతర దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే ఈ జలమార్గంపై.. కొన్ని నెలలుగా వివాదాలు కొనసాగుతున్నప్పటికీ, కాల్పుల విరమణ సమయం ముగిసేవరకూ.. యథావిధిగా వాణిజ్య రవాణా కొనసాగించవచ్చని ఇరాన్ స్పష్టం చేసింది. కాగా.. హోర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు సుమారు 20 శాతం ప్రపంచ క్రూడాయిల్ సరఫరా అవుతుందన్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని, నౌకల రాకపోకలకు సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించినట్టు చెప్పారు. ఈ మేరకు ఇరాన్‌కు ధన్యవాదాలు తెలిపారాయన.

ఇరాన్‌ ప్రకటనతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 8 శాతం మేర పతనమై 90 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ మే నెల కాంట్రాక్ట్‌ 9.8 శాతం తగ్గి.. బ్యారెల్‌ ధర సుమారు 85 డాలర్లకు చేరుకుంది.


ఇవీ చదవండి:

బీజేపీ ఎంపీలకు విప్ జారీ.. ఢిల్లీకి రప్పించిన హైకమాండ్

మీ మనస్సాక్షి చెప్పిందే వినండి.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి: మోదీ

Updated Date - Apr 17 , 2026 | 07:05 PM