Share News

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు అక్రమంగా.. 100 క్షిపణులకు సరిపడా కెమికల్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:38 AM

క్షిపణుల తయారీలో ఉపయోగించే శక్తిమంతమైన సోడియం పెర్‌క్లోరేట్‌ అనే రసాయన పదార్థాన్ని భారీ మొత్తంలో చైనా నుంచి బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తుండగా ఇండోనేషియా వద్ద ఆ దేశ నౌకాదళం పట్టుకుంది

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు అక్రమంగా..  100 క్షిపణులకు సరిపడా కెమికల్‌
sodium

  • నౌకను సీజ్‌ చేసిన ఇండోనేషియా నేవీ

ఢాకా, నవంబరు 23: క్షిపణుల తయారీలో ఉపయోగించే శక్తిమంతమైన సోడియం పెర్‌క్లోరేట్‌ అనే రసాయన పదార్థాన్ని భారీ మొత్తంలో చైనా నుంచి బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తుండగా ఇండోనేషియా వద్ద ఆ దేశ నౌకాదళం పట్టుకుంది. రిజిస్టర్‌ కాని లక్షలాది 4జీ సిమ్‌కార్డులను కూడా సీజ్‌ చేసింది. ఉత్తర సుమత్రాలోని బెలవాన్‌ జలాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎంవీ స్టార్‌లైన్‌ అనే సరుకు రవాణా నౌకను ఈ నెల 7వ తేదీన ఇండోనేషియా నౌకాదళానికి చెందిన పెట్రోలింగ్‌ నౌక కేఆర్‌ఐ సిగలు-857 అడ్డగించింది. అందులో తనిఖీ చేయగా ఈ కెమికల్‌ బయటపడిందని ఇండోనేషియా నేవీ రీజనల్‌ కమాండ్‌-1(కోర్మడా-1) కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ డెన్నీ సెప్తియానా వెల్లడించారు. కొమొరోస్‌ పతాకంతో వెళ్తున్న ఈ నౌకలో 36 కంటెయినర్లు ఉండగా.. వాటిలో 15 కంటెయినర్లలో 405 టన్నుల సోడియం పెర్‌క్లోరేట్‌ను గుర్తించినట్లు చెప్పారు. ఇది 100 క్షిపణులను తయారుచేయటానికి సరిపోతుందని వెల్లడించారు. చైనాలోని లియాన్యుంగాంగ్‌ ఓడరేవు నుంచి బయలుదేరిన ఈ నౌక ఈ నెల 8న బంగ్లాదేశ్‌లోని మోంగ్లా రేవుకు చేరుకోవాల్సి ఉంది. ఈ కెమికల్‌, సిమ్‌కార్డులు బంగ్లాదేశ్‌లో ఎవరికి చేరవేయటానికి తీసుకెళ్తున్నారన్నదానిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నౌక రిజిస్ట్రేషన్‌ గతంలోనే రద్దయిందని, 2027, అక్టోబరు 8 వరకు పర్మిట్‌ ఉన్నట్లు తప్పుడు పత్రాలతో ఇది నడుస్తున్నట్లు గుర్తించామన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

Updated Date - Nov 24 , 2026 | 04:39 AM