Share News

భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు

ABN , Publish Date - Apr 06 , 2026 | 06:33 AM

ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వీరి మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగింది.

భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
India Iran talks

ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 6: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, భారత్ తన దౌత్యపరమైన వ్యూహాలను వేగవంతం చేసింది. తాజాగా, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ (Seyed Abbas Araghchi) భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. పశ్చిమాసియాలో రోజురోజుకూ మారుతున్న పరిణామాలు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఇద్దరు నేతలు చర్చించారు.


చమురు సరఫరాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (Strait of Hormuz) జలసంధి మూసివేత ముప్పు, దానివల్ల ప్రపంచ ఇంధన భద్రతపై పడే ప్రభావం గురించి జైశంకర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ అంశాలతో పాటు భారత్-ఇరాన్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై కూడా ఈ సంభాషణలో ప్రస్తావన వచ్చింది.

ఈ ఫోన్ కాల్‌కు ముందే జైశంకర్ యూఏఈ (UAE), ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రులతో కూడా సంభాషించారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి భారత్ అన్ని కీలక దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల గడువు విధిస్తూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో, ఈ చర్చలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 'ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితులపై చర్చించాము.' అని జైశంకర్ తన 'X' ఖాతాలో ఈ చర్చల గురించి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 06 , 2026 | 06:51 AM