Share News

ఫోర్ట్ హుడ్ కాల్పుల దోషికి మరణశిక్ష.. అత్యంత క్రూరుడైన హంతకుడన్న ట్రంప్

ABN , Publish Date - Oct 10 , 2026 | 08:43 AM

2009లో అమెరికాలోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో జరిగిన కాల్పుల ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో దోషిగా తేలిన మాజీ ఆర్మీ మేజర్ నిదల్ హసన్‌కు మరణశిక్ష విధించడాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా సమర్థించారు.

ఫోర్ట్ హుడ్ కాల్పుల దోషికి మరణశిక్ష..  అత్యంత క్రూరుడైన హంతకుడన్న ట్రంప్
Fort Hood Shooter Nidal Hasan

Fort Hood Shooter Nidal Hasan: అమెరికా చరిత్రలో సంచలనం సృష్టించిన 2009 నాటి ఫోర్ట్ హుడ్ (Fort Hood) సామూహిక కాల్పుల ఘటనలో దోషిగా తేలిన మాజీ ఆర్మీ మేజర్ నిదల్ హసన్ (Nidal Hasan)కి మరణశిక్ష విధించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గట్టిగా సమర్థించారు. దోషి ఎలా చనిపోతాడనేది తనకు ముఖ్యం కాదని, అతనికి మరణశిక్ష పడటం మాత్రం సరైన పరిణామమని ట్రంప్ పేర్కొన్నారు. వైట్‌హౌస్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన, నిదల్ హసన్‌ను 'అత్యంత క్రూరుడైన హంతకులలో ఒకడు'గా అభివర్ణించారు.


డిసెంబర్ 3న మధ్యాహ్నం 1:00 గంటలకు టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో సైనికుల చేతిలో ఫైరింగ్ స్క్వాడ్ (Firing Squad) ద్వారా ఈ మరణశిక్ష అమలు చేస్తారని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సేత్ (Pete Hegseth) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


ఘటన నేపథ్యం

నవంబర్ 5, 2009న టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ మెడికల్ బిల్డింగ్‌లో నిదల్ హసన్ జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 12 మంది సైనికులు, ఒక పౌరుడు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. అల్‌ఖైదా ఉగ్రవాద భావజాలం, ఇరాక్-అఫ్ఘానిస్తాన్ యుద్ధాలపై వ్యతిరేకతతోనే అతను ఈ దాడికి పాల్పడినట్లు కోర్టు విచారణలో తేలింది. 2013లో సైనిక జ్యూరీ అతనికి మరణశిక్ష విధించింది.


ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణశిక్ష

అమెరికా సైన్యంలో 1961 తర్వాత మరణశిక్ష అమలు జరగడం ఇదే మొదటిసారి కాగా.. ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా శిక్ష అమలు చేయడం మాత్రం రెండో ప్రపంచ యుద్ధం (1945) తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దాడి జరిగిన అదే రోజు, అదే సమయంలో (డిసెంబర్ 3, మధ్యాహ్నం 1:00 గంటకు) సైనికుల రైఫిళ్లతో ఈ శిక్షను అమలు చేయనున్నారు.


ప్రత్యక్ష ప్రసారం

ఈ మరణశిక్షను ప్రజలు వీక్షించేలా లైవ్‌స్ట్రీమ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇలాంటి దారుణాలకు పాల్పడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని సమాజానికి తెలియజేసేందుకే దీనిని బహిరంగంగా నిర్వహిస్తున్నట్లు రక్షణ కార్యదర్శి హెగ్‌సేత్ స్పష్టం చేశారు. అయితే అమెరికాలో ఇలా బహిరంగంగా మరణశిక్ష అమలు చేయడం గత 90 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా బంగారం, వెండి ధరలు..

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు

Updated Date - Oct 10 , 2026 | 09:04 AM