ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు కుట్ర.. కో-పైలట్‌కు ఉరిశిక్ష పడే అవకాశం..?
ABN , Publish Date - Oct 05 , 2026 | 07:52 PM
ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కుట్ర చేసిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మరణశిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. విమానాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించినట్లు రుజువైతే అతనికి ఉరిశిక్ష తప్పదని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
అబుదాబి: ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కుట్ర చేసిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మరణశిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. విమానాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించినట్లు రుజువైతే అతనికి ఉరిశిక్ష తప్పదని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఒమన్‌కు చెందిన ఆ 29 ఏళ్ల నిందితుడు యూఏఈలో విచారణ ఎదుర్కొంటున్నాడు.
విచారణలో భాగంగా.. ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో విమానాన్ని కూల్చాలని ముందుగానే ప్రణాళిక రూపొందించినట్లు అల్-హమ్మామీ చెప్పినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాలను నడిపే సంస్థలో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించానని, అందుకే ఫ్లైదుబాయ్‌ను ఎంచుకున్నానని తెలిపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఫ్లైదుబాయ్‌లో సుమారు ఎనిమిది నెలలు పనిచేసిన అతను గత జులైలోనే విమానాన్ని కూల్చే ప్రయత్నం చేయాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే, అప్పటికి సిబ్బందిలోని ఓ సభ్యుడితో సన్నిహితంగా ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడని సమాచారం. అనంతరం ప్రణాళికను కొనసాగించి.. కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై క్రాష్ యాక్స్‌తో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో అల్-హమ్మామీకి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని యూఏఈ ప్రాసిక్యూషన్ కోరుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అతను ఏదైనా ఉగ్రవాద సంస్థ ఆదేశాలతో పనిచేశాడా, లేక ఒంటరిగానే కుట్ర పన్నాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా ఇజ్రాయెల్‌కు చెందిన మోసాద్ అధికారులు, విమానయాన నిపుణులు అబుదాబికి చేరుకున్నట్లు సమాచారం. ఇద్దరు అమెరికా నిఘా అధికారులు కూడా అక్కడికి వెళ్లినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే వారు నిందితుడి విచారణలో ప్రత్యక్షంగా పాల్గొంటారా లేదా అన్నది స్పష్టంగా తెలియలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్..
ఘోర పడవ ప్రమాదం.. రెండు పడవలు ఢీకొని 30 మంది మృతి