Share News

వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్..

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:27 PM

2026 సంవత్సరానికి గాను వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా గెలుచుకున్నారు. అమెరికాకు చెందిన కార్ల్ డీసెరోత్, జర్మనీకి చెందిన పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్‌లకు సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.

వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్..
Nobel Prize winners 2026 Medicine

ఇంటర్నెట్ డెస్క్: 2026 సంవత్సరానికి గాను వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా గెలుచుకున్నారు. అమెరికాకు చెందిన కార్ల్ డీసెరోత్, జర్మనీకి చెందిన పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్‌లకు సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. కాంతి ద్వారా నాడీకణాల కార్యకలాపాలను నియంత్రించేందుకు ఉపయోగపడే సాంకేతికత, కాంతి ఆధారిత అయాన్ మార్గాలపై చేసిన పరిశోధనలకు ఈ అవార్డును ప్రకటించారు (Nobel Prize 2026 Medicine).


ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనలకు సంబంధించిన సాంకేతికతను 'ఆప్టోజెనెటిక్స్' అని పిలుస్తారు. ప్రాణంతో ఉన్న జీవి మెదడులోని నిర్దిష్ట నాడీకణాలను కాంతిని ఉపయోగించి క్రియాశీలం చేయడం లేదా వాటి కార్యకలాపాలను నిలిపివేయడం 'ఆప్టోజెనెటిక్స్' ద్వారా సాధ్యమవుతుంది. మెదడులో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, ప్రవర్తన ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలకు ఈ విధానం కొత్త మార్గాన్ని తెరిచింది (Light-gated ion channels).


పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్‌లు ఒకే కణంతో ఉండే ఆల్గీపై పరిశోధనలు చేసి, కాంతికి స్పందించే ప్రత్యేకమైన ప్రోటీన్‌ను గుర్తించారు. దీనిని 'ఛానల్‌రోడాప్సిన్' అని పిలుస్తారు. ఈ ప్రోటీన్‌పై నీలి కాంతి పడినప్పుడు కణంలో ఒక మార్గం తెరుచుకుని విద్యుత్ సంకేతాన్ని సృష్టించే విధంగా అయాన్లు కదులుతాయి. ఈ ఆవిష్కరణను కార్ల్ డీసెరోత్ నాడీకణాలపై ప్రయోగించారు. ఛానల్‌రోడాప్సిన్‌కు సంబంధించిన జన్యువును ఎలుకల నాడీకణాల్లో ప్రవేశపెట్టి, నీలి కాంతిని ఉపయోగించడం ద్వారా నాడీ సంకేతాలను నియంత్రించగలిగారు (Nobel Medicine winners 2026).


ఆప్టోజెనెటిక్స్ ద్వారా మెదడులోని నిర్దిష్ట నాడీ మార్గాలు.. జ్ఞాపకాలు, భావాలు, ప్రవర్తన వంటి అంశాలను ఎలా ప్రభావితం చేస్తాయో పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. నాడీ సంబంధిత, మానసిక ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవడంలోనూ ఈ విధానం కీలకంగా మారింది. చూపు కోల్పోయిన కొంతమంది రోగుల్లో దృష్టిని పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఆప్టోజెనెటిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. వినికిడి లోపాల చికిత్సలో ఉపయోగించే కోక్లియర్ ఇంప్లాంట్లను మరింత ఖచ్చితంగా పనిచేయించే మార్గంగానూ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..


మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 05 , 2026 | 06:29 PM