ఫ్లై దుబాయ్ విమాన ప్రమాదం.. ప్రయాణికులను కాపాడిన హీరోలు వీరే..
ABN , Publish Date - Oct 01 , 2026 | 03:37 PM
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. పైలట్‌పై కో-పైలట్ దాడి చేయడంతో విమానం అదుపుతప్పింది. ప్రయాణికులను రక్షించేందుకు పైలట్ స్మిత్ మచ్చార్‌తో పాటు పలువురు ప్రయాణికులు చూపిన ధైర్యం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది.
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. పైలట్‌పై కో-పైలట్ దాడి చేయడంతో విమానం అదుపుతప్పి వేగంగా కిందికి దూసుకెళ్లింది. అయితే పైలట్ అప్రమత్తత, సిబ్బంది ధైర్యం, కొందరు ప్రయాణికుల సాహసం కలిసి పెను విషాదాన్ని తప్పించాయి. తీవ్రంగా గాయపడినప్పటికీ విమానాన్ని రక్షించేందుకు ప్రయత్నించిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌తో పాటు నలుగురు ఇజ్రాయెల్ ప్రయాణికులు చూపిన ధైర్యసాహసాలు ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నాయి.
పైలట్‌పై దాడి.. క్షణాల్లో మారిన పరిస్థితి..
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ఫ్లై దుబాయ్ FZ1073 విమానం వెళ్తోంది. ఆ సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 27 మంది పిల్లలు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అయితే, విమాన ప్రయాణం మధ్యలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఆయన సహ పైలట్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాడిలో మచ్చార్ తీవ్రంగా గాయపడినా అప్రమత్తంగా వ్యవహరించారు. కాక్‌పిట్ తలుపు తెరిచి, సిబ్బందిని అప్రమత్తం చేశారు. అప్పటికే విమానం వందల అడుగుల మేర కిందికి దూసుకెళ్లడంతో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో కొందరు ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి చేరుకుని, దాడి చేసిన వ్యక్తిని నియంత్రించేందుకు సిబ్బందికి సహకరించారు.
కీలకంగా వ్యవహరించింది వీరే..
ప్రయాణికుల్లో ఒకరైన యానివ్ హయూన్ కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడి చేసిన సహ పైలట్‌ను నియంత్రించడంలో కీలకంగా సహకరించారు. ఆ సమయంలో కాక్‌పిట్‌లో పైలట్లు తమ సీట్లలో లేరని, నిందితుడు విమాన నియంత్రణల వద్ద ఉన్నాడని ఆయన తెలిపారు. అతడిని అక్కడి నుంచి దూరంగా లాగిన తర్వాత విమానం స్థిరపడేందుకు కంట్రల్ యోక్(control yoke)ను వెనక్కి లాగినట్లు హయూన్ చెప్పారు. విమాన ప్రమాదాలపై రూపొందించే టీవీ కార్యక్రమం మేడే (Mayday) చూస్తుంటానని, అందులో చూసిన విషయాలు ఆ సమయంలో తనకు గుర్తొచ్చాయని ఆయన తెలిపారు.
మరో ప్రయాణికుడు అస్సాఫ్ రాజువాన్ మాట్లాడుతూ విమానం ఒక్కసారిగా తీవ్రంగా కిందికి దూసుకెళ్లడంతో పరిస్థితి భయానకంగా మారిందన్నారు. కాక్‌పిట్ వైపు నుంచి అరుపులు వినిపించాయని, ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ప్రయాణికులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. 'విమానం అదుపు తప్పి కిందికి వెళ్తున్నట్లు అనిపించింది. అందరూ భయంతో కేకలు వేస్తున్నారు. కాక్‌పిట్‌లోకి వెళ్లిన తర్వాత రక్తం కనిపించింది' అని ఆయన వివరించారు. ప్రయాణికులు, సిబ్బంది కలిసి దాడి చేసిన వ్యక్తిని దాదాపు 50 నిమిషాల పాటు అదుపులో ఉంచినట్లు రాజువాన్ తెలిపారు.
జ్వికా మానెస్ కూడా కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు. విమానంలో అందించిన మల్టీమీడియా హెడ్‌ఫోన్‌ల కేబుళ్లను ఉపయోగించి అతడిని కట్టేసినట్లు తెలిపారు. 'విమానం వేగంగా కిందికి దూసుకెళ్తోంది. ప్రజలు చుట్టూ పడిపోతున్నారు. పరిస్థితి చాలా భయానకంగా ఉంది. చివరకు అతడిని అదుపులోకి తీసుకున్నాం' అని మానెస్ చెప్పారు.
ఈ ఘటనలో మరో కీలక పాత్ర పోషించిన వ్యక్తి షోటా ముసావ్. వృత్తిరీత్యా దంత వైద్యుడైన ఆయన విమానంలో ఉన్న ఏకైక వైద్య నిపుణుడిగా గాయపడిన పైలట్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న మచ్చార్‌కు చికిత్స చేసినట్లు ముసావ్ తెలిపారు. పైలట్ స్పృహలోనే ఉన్నారని, తమతో మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. చివరికి వీరంతా కలసి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకుని తమతో పాటు 170 మంది ప్రాణాలను కాపాడారు. వీరిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
అఫ్గాన్‌లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతగా నమోదు
ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’పై అప్పీల్ కొట్టివేత