తగ్గనున్న యూరోపియన్ కార్ల ధరలు!
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:11 AM
యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ సిద్ధమైనట్టు సమాచారం.
15 వేల యూరోలకు మించి ఉన్న కార్లపై సుంకాలు
110 శాతం నుంచి 40 శాతానికి.. ఆ తర్వాత 10 శాతానికి!
న్యూఢిల్లీ, జనవరి 26: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ సిద్ధమైనట్టు సమాచారం. యూరప్ నుంచి దిగుమతి అవుతున్న కార్లపై ఇండియా ప్రస్తుతం 110 శాతం సుంకాలను విధిస్తోంది. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో భాగంగా.. 15 వేల యూరోలకు (దాదాపు రూ.16 లక్షలకు) మించి ఖరీదు ఉన్న కార్లపై ఆ సుంకాలను 110 నుంచి 40 శాతానికి (అంటే ఏకంగా 70 శాతం మేర) తగ్గించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాలక్రమంలో ఆ సుంకాన్ని దశలవారీగా 10 శాతానికి తగ్గించే ఆలోచన కూడా ఉన్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ తగ్గింపును ఏడాదికి 2 లక్షల కార్ల ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కార్లకు వర్తింపజేస్తామని.. చర్చల్లో భాగంగా భారత్ ప్రతిపాదించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సంఖ్యలో, సుంకాల శాతంలో చివరి నిమిషంలో మార్పులు ఉండే అవకాశం కూడా ఉందని తెలిపాయి. దేశీయ కార్ల తయారీ సంస్థలు విద్యుత్ వాహనాల రంగంలో పెట్టిన పెట్టుబడులకు రక్షణ కల్పించేందుకుగాను.. యూరప్ నుంచి దిగుమతి అయ్యే విద్యుత్ వాహనాలకు మాత్రం ఐదేళ్లపాటు సుంకాలు తగ్గించకూడదని భారత్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత దశలవారీగా ఈవీలపై కూడా సుంకాలు తగ్గించనున్నట్టు తెలిసింది. అమెరికా, చైనాల తర్వాత మన దేశం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్ అయినప్పటికీ.. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమను కాపాడేందుకు మన ప్రభుత్వాలు రక్షణాత్మక విధానాలను అనుసరిస్తూ, విదేశీ కార్లపై అత్యధిక దిగుమతి సుంకాలను విధిస్తున్న సంగతి తెలిసిందే. భారత్-ఈయూ ఎఫ్‌టీఏలో భాగంగా ఆ సుంకాలను తగ్గిస్తే.. రెనో, ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఔడీ, స్కోడా, వోల్వో, వంటి ఖరీదైన కార్ల ధరలు మనదేశంలో గణనీయంగా తగ్గనున్నాయి.
నిజానికి ఈ కంపెనీలు తమ కార్లలో చాలా మోడళ్లను సీకేడీ (కంప్లీట్‌లీ నాక్‌డ్ డౌన్) విధానంలో విడిభాగాల రూపంలో ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడ అసెంబుల్ చేయడం ద్వారా తక్కువ దిగుమతి సుంకాలకు అర్హత పొందుతున్నాయి. ఎఫ్‌టీఏ వల్ల.. బీఎండబ్ల్యూ ఎం, మెర్సిడె్‌స-ఏఎంజీ, ఔడీ-ఆర్‌ఎస్ వంటి కార్ల ధరలు బాగా తగ్గే అవకాశం ఉంది. లాండ్ రోవర్, డిఫెండర్ కార్ల ధరలు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. కాగా, ఏడాదికి దాదాపు 44 లక్షల యూనిట్లుగా ఉన్న భారత కార్ల మార్కెట్‌లో యూరోపియన్ కార్ల వాటా కేవలం 4 శాతమే! భారత కార్ల మార్కెట్‌లో.. జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీతోపాటు, దేశీయ తయారీ సంస్థలైన టాటా, మహీంద్రాల ఆధిపత్యం కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి