భారత వృద్ధికి ‘ఏఐ’ చోదక శక్తి
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:56 AM
కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు పోవడం పక్కన పెడితే మన ఆర్థిక వ్యవస్థకు మాత్రం ప్రధాన చోదక శక్తిగా మారనుంది. పెద్దఎత్తున ఏఐ వినియోగం ద్వారా 2035 నాటికి మన దేశ వ్యవసాయ...
అదనంగా రూ.55.84 లక్షల కోట్లు: పీడబ్ల్యూసీ
2035 నాటికి జీడీపీలో 15 శాతం
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు పోవడం పక్కన పెడితే మన ఆర్థిక వ్యవస్థకు మాత్రం ప్రధాన చోదక శక్తిగా మారనుంది. పెద్దఎత్తున ఏఐ వినియోగం ద్వారా 2035 నాటికి మన దేశ వ్యవసాయ, ఆరోగ్య రక్షణ, ఇంధనం, విద్య, తయారీ రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత లేదన్నా 60,700 కోట్ల డాలర్ల (ప్రస్తుత మారకం రేటు ప్రకారం సుమారు రూ.55.84 లక్షల కోట్లు) వరకు అదనంగా జోడిస్తాయని పీడబ్ల్యూసీ అనే సంస్థ ఒక నివేదికలో తెలిపింది. అప్పటి దేశ జీడీపీలో ఇది దాదాపు 15 శాతానికి సమానం. ఏఐకి తోడు ప్రభుత్వ ప్రత్యేక విధానాలు, పెట్టుబడులతో ఈ రంగాల్లో ఉత్పాదకత కూడా బాగా పెరగనుందని తెలిపింది. వర్థమాన దేశాలు సక్రమ వినియోగం ద్వారా, ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాలను మార్చివేసే సాధనంగా ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చనే దానికి కూడా భారత్ చక్కటి ఉదాహారణగా నిలుస్తుందని పేర్కొంది.
వ్యవ‘సాయ’మే
పారిశ్రామిక, సేవల రంగాలు ఎంతగా అభివృద్ధి చెందినా 2047 వరకు భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముకగా ఉంటుందని పీడబ్ల్యూసీ నివేదిక తేల్చి చెప్పింది. ఇందుకోసం 2025 మార్చి నాటికి 63,700 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.58.60 లక్షల కోట్లు) ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల విలువను 2047 నాటికి 2,35,900 కోట్ల డాలర్లకు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే చిన్న కమతాలు, తక్కువ ఉత్పాదకతలు పెద్ద సవాళ్లుగా మారతాయని తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే భారత్‌లో వ్యవసాయ దిగుబడులు 40 నుంచి 50 శాతం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. భారత రైతుల్లో నూటికి 86 శాతం సన్న, చిన్నకారు రైతులు కావడం, వారి సగటు కమతాల పరిమాణం ఒక హెక్టారు కంటే తక్కువ ఉండడం ప్రధాన సమస్యలని పేర్కొంది. అయితే ఏఐ, డిజిటల్ టెక్నాలజీల వినియోగం ద్వారా ఈ సమస్యలను చాలా వరకు అధిగమించవచ్చని అంచనా వేసింది. ఏఐ, డిజిటల్ టెక్నాలజీల వినియోగం ద్వారా విద్య, ఇంధనం, ఆరోగ్య, తయారీ రంగాల్లోనూ భారత్ ఆర్థికంగా దూసుకుపోతుందని పోతుందని పీడబ్ల్యూసీ పేర్కొంది.
ఇవీ చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్! ఈ వారం కూడా దూకుడు తప్పదా..
రూపాయి పతనంపై దిగుమతిదారుల బెంబేలు