Share News

బ్రెయిన్‌ సర్జన్‌ రోబో

ABN , Publish Date - May 08 , 2026 | 05:30 AM

పక్షవాతం వల్ల మాట పడిపోయినవారు, మంచానికే పరిమితమైనవారు ఇతరులకు తమ ఆలోచనలను చేరవేసే వీలు కల్పించే ‘బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫే్‌స(బీసీఐ)’లను...

బ్రెయిన్‌ సర్జన్‌ రోబో

మెదడులో ఏ మూలకైనా వెళ్లి ఇంప్లాంట్లను అమరుస్తుంది

డాక్టర్లకు గంటల సమయం పట్టే పనిని ఇట్టే చేసే సత్తా

ఈలన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ సంస్థ ఆవిష్కరణ

లండన్‌, మే 7: పక్షవాతం వల్ల మాట పడిపోయినవారు, మంచానికే పరిమితమైనవారు ఇతరులకు తమ ఆలోచనలను చేరవేసే వీలు కల్పించే ‘బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫే్‌స(బీసీఐ)’లను అభివృద్ధి చేస్తున్న న్యూరాలింక్‌ సంస్థ మరో కీలకమైన అడుగు వేసింది! ఆయా ఇంప్లాంట్లను మెదడులో అమర్చడానికి ఎదురవుతున్న పెనుసవాల్‌ను అధిగమించే సరికొత్త సర్జరీ రోబోను అభివృద్ధి చేసింది. మెదడులోని ఏ భాగానికైనా, ఏ మూలకైనా అత్యంత జాగ్రత్తగా, ఏ రక్తనాళానికీ దెబ్బ తగలకుండా వెళ్లి ఆయా బ్రెయిన్‌-ఇంప్లాంట్లను అమర్చే రోబో ఇది. మెదడులోని నరాలు అత్యంత సున్నితంగా.. వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి! సర్జరీ సమయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. నరాలు దెబ్బతిని ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. రక్తస్రావమై, అది గడ్డకట్టి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. శాశ్వతవైకల్యానికి గురయ్యే ముప్పు పొంచి ఉంటుంది. అందుకే ‘బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ ఇంప్లాంట్లను (చిప్‌లను) ఎలాంటి సమస్యా లేకుండా మెదడులో అమర్చడానికి న్యూరాలింక్‌ దీన్ని తయారుచేసింది. ఈ చిప్‌లను మెదడులోని మోటార్‌ కార్టెక్స్‌ భాగంలో అమరుస్తారు. ఈ చిప్‌లలో సూక్ష్మ దారాల్లాంటి థ్రెడ్స్‌ ఉంటాయి. ఈ థ్రెడ్స్‌పై అనేక సెన్సర్లు (ఎలకో్ట్రడ్స్‌.. ఇలాంటి ఎలకో్ట్రడ్స్‌ ఒక్కో చిప్‌లో 1000కి పైగానే) ఉంటాయి. వాటిని ఈ రోబో జాగ్రత్తగా మెదడులో నిర్ణీత భాగానికి తీసుకెళ్లి అమరుస్తుంది. నిపుణుడైన బ్రెయిన్‌ సర్జన్‌ సైతం ఆ థ్రెడ్స్‌ను ఒక్కొక్కటిగా అమర్చాలంటే అందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. కానీ, ఆ పనిని ఈ రోబో అతి తక్కువ సమయంలో, అత్యంత సమర్థంగా చేయగలదు. అలా చేయడానికి వీలుగా దీంట్లో ఎనిమిది కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాలను, ఓసీటీ (ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టోమోగ్రఫీ) స్కానర్లను, రియల్‌ టైమ్‌ నావిగేషన్‌ను ఉపయోగించుకుని ఇది ఎలకో్ట్రడ్స్‌ను మెదడులో కావాల్సిన భాగానికి నేర్పుగా పంపిస్తుంది. ఎలకో్ట్రడ్‌ను లోపలికి పంపించేటప్పుడు ఏదైనా రక్తనాళం అడ్డొస్తే.. రోబో తనంతతానుగా దారి మార్చి, ఆ రక్తనాళాన్ని ఏ మాత్రం తగలకుండా పక్కనుంచి వెళ్తుంది. ఇలా వెళ్లడానికి ఈ రోబో ‘ఫైవ్‌ యాక్సిస్‌’ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది.


ఏమిటీ ఫైవ్‌ యాక్సిస్‌ సిస్టమ్‌?

సర్జరీలు చేసే రోబోల కదలికలు సాధారణంగా మూడు వైపులకు (త్రీ-యాక్సిస్‌) మాత్రమే ఉంటాయి. కుడి, ఎడమలకు.. ముందు, వెనుకలకు.. కిందికి, పైకి. కానీ, ఈ రోబో చేతికి ‘టిల్ట్‌ (వంగడం)’, ‘రొటేట్‌ (తిరగడం)’ అనే మరో రెండు కదలికలు కూడా ఉంటాయి. దీనివల్ల అవసరమైన కోణంలో వంగి వెళ్లగలదు. మెదడులో లోతైన, కష్టతరమైన భాగాలకు కూడా సురక్షితంగా వెళ్లగలదు. న్యూరాలింక్‌ అభివృద్ధి చేసిన ఈ రోబో గురించి.. ఎలన్‌ మస్క్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest National News And Telugu News

Updated Date - May 08 , 2026 | 05:33 AM