చాలా రిచ్.. పని రాక్షసుడు
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:18 AM
స్పేస్ ఎక్స్ షేర్లు సూపర్ హిట్ కావడంతో ఎలాన్ మస్క్ ఆస్తుల నికర విలువ ఒక్కరోజులోనే 164.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15.5 లక్షల కోట్ల) మేర పెరిగిపోయి ప్రపంచంలోనే తొలి ‘డాలర్ ట్రిలియనీర్’గా...
తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్..
నివసించేది 450 చ.అ.ల ఫ్లాట్‌లో!
స్పేస్‌ఎక్స్ ఐపీవో ద్వారా ఒక్కరోజు
మస్క్‌కు వచ్చిన లాభం.. అంబానీ
సంపదకు దాదాపు రెట్టింపు!
మస్క్ కలెక్షన్‌లో ప్రైవేట్ జెట్లు,
విలాసవంతమైన, వింటేజ్ కార్లు,
ఖరీదైన పలు చేతి గడియారాలు
నలుగురు భాగస్వాముల ద్వారా 14 మంది పిల్లలు
వారి కోసం ఆస్టిన్‌లో విలాసవంతమైన మ్యాన్షన్
స్పేస్‌ఎక్స్ ఐపీవో ద్వారా ఒక్క రోజు మస్క్‌కు వచ్చిన లాభం.. అంబానీ సంపదకు రెట్టింపు!
స్పేస్ ఎక్స్ షేర్లు సూపర్ హిట్ కావడంతో ఎలాన్ మస్క్ ఆస్తుల నికర విలువ ఒక్కరోజులోనే 164.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15.5 లక్షల కోట్ల) మేర పెరిగిపోయి ప్రపంచంలోనే తొలి ‘డాలర్ ట్రిలియనీర్’గా అవతరించిన సంగతి తెలిసిందే! స్పేస్ ఎక్స్ ఐపీవోకు వెళ్లిన ఒక్కరోజే పెరిగిన మస్క్ సంపద.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మొత్తం సంపద కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం (ఇంచుమించుగా 1.9 రెట్లు)!! ఇటీవలే రూ.5 వేల కోట్లతో రెండో కుమారుడు అనంత్ పెళ్లి చేసిన ముకేశ్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ 89.7 బిలియన్ డాలర్లు. అంటే ఇంచుమించుగా రూ.8.5 లక్షల కోట్లకు కాస్త అటూ ఇటూ. అదే మస్క్ సంపద.. 1.3 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో.. అక్షరాలా కోటీ ఇరవై రెండు లక్షల కోట్లు (రూ.1.22 కోట్ల కోట్లు). మనం ఊహించలేనంత పెద్ద సంఖ్య ఇది. ఇంత సంపద ఉన్న మస్క్ ఉండేది లంకంత కొంపలో కాదు. టెక్స్‌సలో కేవలం 400 చదరపుటడుగుల విస్తీర్ణం ఉండే ఇంట్లో ఉంటారంతే. అందులో ఒక పడగ్గది, హాల్, కిచెన్, ఒక బాత్‌రూమ్ ఉంటాయి. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉండడానికి కారణం.. విలాసవంతమైన విల్లాలు, ఖరీదైన గృహాలను ఆస్తులుగా కంటే ఖర్చుగా చూస్తారాయన. వాటిని కొనడం వల్ల ఖర్చే తప్ప రాబడి ఉండదని.. వ్యక్తిగత విలాసాలకు డబ్బు ఖర్చు చేయడం వృథా అని.. దానికి బదులు వ్యాపారం మీద ఖర్చు పెట్టడం వల్ల లాభాలు సంపాదించవచ్చని మస్క్ చెబుతారు. అలాగని మస్క్ అసలు ఆస్తులేమీ కొనలేదా? అసలు విలాసాలకే ఖర్చు పెట్టరా అంటే.. అలాంటిదేమీ లేదు. ఇల్లు విషయంలోనే ఆయన పొదుపు. విలాసాలకు కొదవేమీ లేదు. ఇళ్ల విషయానికే వస్తే.. తన 14 మంది పిల్లలు, వారి తల్లులు ఉండడానికి ఆస్టిన్‌లో పెద్ద మ్యాన్షనే కొన్నారాయన. దాని ఖరీదు అక్షరాలా రూ.330 కోట్లకు పైమాటే. ఇక, ప్రయాణాల కోసం ఆయనకూ రెండు సొంత రెండూ గల్ఫ్‌స్ట్రీమ్ జీ550 జెట్ విమానాలున్నాయి. ఒక్కో విమానం విలువ 14 మిలియన్ డాలర్లు. అంటే దాదాపుగా రూ.132 కోట్లు. 6 వేల మైళ్ల దూరం ఆగకుండా ప్రయాణించగలవు.
1977లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమా ‘ద స్పై హూ లవ్డ్ మీ’ సినామాలో.. బాండ్ పాత్రధారి రోజర్‌మూర్ ఒక కారు (లోటస్ ఎస్ర్పిట్) వాడతాడు. నీళ్లలోకి వెళ్లగానే సబ్‌మెరైన్‌లా మారిపోతుందా కారు ఆ సినిమాలో. మస్క్ ఆ పాత కారును మిలియన్ డాలర్లు (దాదాపు రూ.9.43 కోట్లు) వెచ్చించి కొన్నారు. ఆ తర్వాత టెస్లా తయారుచేసిన ‘సైబర్ ట్రక్’ను చూస్తే.. ఆ సబ్‌మెరైన్ కారు పోలికలు బాగా కనిపిస్తాయి. అదొక్కటే కాదు.. ఆయన కార్ల కలెక్షన్‌లో మెక్‌లారెన్ ఎఫ్1, క్లాసిక్ పోర్ష 911 లాంటి అధునాతన కార్లు.. 1920నాటి ఫోర్డ్ మోడల్ టి, 1967 నాటి జాగ్వార్ ఈ టైప్ వంటి వింటేజ్ కార్లు.. ఇలా చాలానే ఉన్నాయి.
ప్రపంచంలోని ఇతర సంపన్నులందరి దగ్గరా ఉన్నట్టే.. మస్క్ దగ్గర కూడా అత్యంత ఖరీదైన చేతిగడియారాల కలెక్షన్ ఉంది. 50 వేల డాలర్ల విలువైన ఆడెమార్స్ పిగెట్ వాచ్, 2 లక్షల డాలర్ల విలువైన రిచర్డ్ మిల్లే వాచ్ వంటివి ఆయన కలెక్షన్‌లో ఉన్నాయి.
మస్క్ కోసం అమెరికాలోని సెలబ్రిటీ జ్యువెలర్ బెన్ బాలర్ 37వేల డాలర్ల విలువైన ఒక ఉంగరాన్ని తయారుచేసిచ్చాడు. ఈ ఉంగరంలో టెస్లా అనే అక్షరాలను వజ్రాలతో పొదిగారు.
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని సామెత. మరి టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలకు అధిపతి అయిన మస్క్ తల్చుకుంటే? ఏమవుతుంది.. ఆయన టెస్లా కారు ఎంచక్కా స్పేస్ ఎక్స్ రాకెట్ ఎక్కి రోదసిలోకి వెళ్లగలుగుతుంది. అవును.. 2018లో మస్క్ తన 2010 మోడల్ టెస్లా రోడ్‌స్టర్ కారును ఫాల్కన్ హెవీ రాకెట్‌లో పేలోడ్‌గా అంతరిక్షంలోకి పంపారు. ఆ కారు డ్రైవింగ్ సీట్‌లో ఒక బొమ్మను పెట్టారు. ఆ బొమ్మకు స్టార్‌మ్యాన్ అని పేరు పెట్టారు. అలాగే.. కారు సర్క్యూట్ బోర్డు మీద.. ‘భూమిపై మనుషులు తయారుచేసిన కారు’ అని ప్రింట్ చేశారు.
మస్క్ ఇంత సంపన్నుడు కావడానికి.. స్పేస్‌ఎక్స్, టెస్లా, ఎక్స్‌ఏఐ, న్యూరాలింక్‌లాంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలను స్థాపించి, విజయవంతంగా నడపడానికి కావడం.. ఆయన పనిచేసే విధానమే. ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులందరూ మస్క్ గురించి చెప్పే ఒకే ఒక్క మాట.. పని రాక్షసుడు. తానెంత నిబద్ధతతో పనిచేస్తాడో.. తన దగ్గర పనిచేసేవారు కూడా అంతే నిబద్ధతతో పనిచేయాలని మస్క్ ఆశిస్తారు. అలాగే.. మస్క్ కంపెనీల్లో ఎక్కడా సుదీర్ఘ మీటింగులు జరగవు. ఉద్యోగులు సూటిగా, సుత్తి లేకుండా పాయింట్ చెప్పాలి. ఆయన కంపెనీల్లో ఎవరు ఏ స్థాయి అధికారితోనైనా అయినా నేరుగా మాట్లాడొచ్చు. పని త్వరగా కావడం ముఖ్యం. మస్క్ ఏదైనా పని అప్పగిస్తే ఉద్యోగులకు మూడు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి.. ఆయన చెప్పినదాంట్లో ఏవైనా తప్పులుంటే వాటి గురించి చెప్తూ నేరుగా ఆయనకు మెయిల్ పెట్టాలి. రెండు.. ఆయన చెప్పింది అర్థం కాకపోతే సందేహాలు నివృత్తి చేయమని అడగాలి. తప్పులు, సందేహాలు.. రెండూ లేకపోతే మస్క్ చెప్పిన పని పూర్తిచేయాలి. మూడూ చేయకపోతే.. మర్నాడు ఉద్యోగానికి రావక్కర్లేదు!!
సెంట్రల్ డెస్క్
మస్క్ కొడుకు.. అతడి కంటే ఘనుడు!
‘‘ప్రపంచంలో తెలివైన వాళ్లంతా ఎక్కువ మంది పిల్లలను కనాలి. లేకపోతే నాగరికత అంతరించిపోతుంది’’ ..అని మస్క్ నిశ్చితాభిప్రాయం. జననాల రేటు పడిపోవడం భూమికి ముప్పుగా పరిగణిస్తారు. అందుకే ఆయన ఇప్పటిదాకా 14 మంది పిల్లలకు జన్మనిచ్చారు. వాళ్ల పేర్లు పెట్టడంలో కూడా ఆయన చాలా భిన్నమైన అభిరుచులను కనబరిచారు. రోమన్, గ్రీకు దేవతల పేర్ల నుంచి లెక్కల్లో ఆల్జీబ్రాలో వాడే ‘ఎక్స్’ దాకా చిత్రవిచిత్రమైన పేర్లను పెట్టారు. మొదటి భార్య జస్టిన్ విల్సన్ ద్వారా మస్క్‌కు ఆరుగురు సంతానం. అయితే, వారిలో.. 2002లో జన్మించిన మొదటి కుమారుడు నెవాడా అలెగ్జాండర్ పదివారాల వయసులోనే మరణించాడు. తర్వాత ఆమెకు 2004లో కవలలు (వివియన్ జెన్నా, గ్రిఫిన్), 2006లో ట్రిప్లెట్స్ (ముగ్గురు పిల్లలు.. కై, సాక్సన్, డామియన్) జన్మించారు. మస్క్ రెండో భాగస్వామి గ్రిమ్స్ ద్వారా ముగ్గురు పిల్లలు (ఎక్స్‌యా్‌షఏ12/ఎక్స్‌ఏఐఏ12, ఎక్సాడార్క్ సైడీరియల్, టెక్నో మెకానికస్) పుట్టారు. ఇక మూడో భాగస్వామి శివోన్ జిలిస్ ద్వారా నలుగురు పిల్లలకు (స్ట్రైడర్, అజూర్ (వీళ్లు కవలలు), ఆర్కాడియా, సెల్డన్ లైకర్గస్) మస్క్ జన్మనిచ్చారు. నాలుగో భాగస్వామి, రచయిత్రి అయిన యాష్లే సెయింట్ క్లైర్‌కు 2024లో ఒక అబ్బాయి పుట్టాడు. ఆ బాలుడి పేరు.. రోమ్యులస్. ఇంకా.. జపాన్‌కు చెందిన ఒక పాప్‌స్టార్ ద్వారా కూడా ఒక అబ్బాయికి జన్మనిచ్చానంటూ మస్క్ తనతో తెలిపినట్టు యాష్లే సెయింట్ క్లైర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది నిజమైతే మస్క్ పిల్లల సంఖ్య 15. ఇలా ప్రపంచానికి తెలియని పిల్లలు మస్క్‌కి ఇంకా ఎంతమంది ఉన్నారో!! ఈ పిల్లలందరిలోనూ.. మొదటి భార్యకు జన్మించిన డామియన్ అసాధారణ ప్రతిభావంతుడని చెబుతారు. క్లాసికల్ మ్యూజిక్‌తోపాటు.. సైన్స్, గణితంలో అతడు దిట్ట అని అంటారు. ఎలాన్ మస్క్ తల్లి మాయే ప్రకారం.. డామియన్ మస్క్‌కన్నా తెలివైనవాడు! ఈలెక్కన భవిష్యత్తులో అతడెన్ని రికార్డులు సృష్టిస్తాడో!!
ఏఐ.. దెయ్యానికి ఆహ్వానమే!
టెక్నాలజీ అంటే ఎంతగానో ఇష్టపడే ఎలాన్ మస్క్.. కృత్రిమ మేధ (ఏఐ)ని మాత్రం అంతగా ఇష్టపడరు. మానవాళికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు కృత్రిమ మేధే అంటారాయన. ఏఐని అభివృద్ధి చేయడమంటే.. ‘మన అదుపులో ఉండని దెయ్యాన్ని మనమే ఆహ్వానించుకున్నట్టు’గా అభివర్ణిస్తారు. ఏఐపై గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థలు ఏకఛత్రాధిపత్యం సాధించకుండా ఉండడానికి 2015లో ఆయన శామ్ ఆల్ట్‌మన్‌తో కలిసి ‘ఓపెన్‌ఏఐ’ సంస్థను లాభాపేక్ష లేనిఓపెన్‌సోర్స్ సంస్థగా ప్రారంభించారు. అందరికీ ఏఐ సాంకేతికత అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో ఆయన స్థాపించిన ఆ సంస్థను తన అదుపులో ఉంచుకోవాలని 2018లో ప్రయత్నం చేశారు. కానీ, అందుకు బోర్డు ఒప్పుకోకపోవడంతో దాన్నుంచి బయటికొచ్చేశారు. దరిమిలా ‘ఓపెన్ ఏఐ’ లాభాపేక్ష గల సంస్థగా మారి మైక్రోసాఫ్ట్ చేతికి వెళ్లింది. అందుకే.. ఆ సంస్థ అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీని మస్క్ తరచూ ‘రాజకీయ భావజాలాలకు లొంగి నిజాలను దాచే ఏఐ’ అని విమర్శిస్తుంటారు. తర్వాత ఆయన ‘ఎక్స్‌ఏఐ’ అనే మరో స్టార్ట్‌పను ప్రారంభించి.. ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్‌ని అభివృద్ధి చేశారు.
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్